జీవితంలో బాల్యం చాలా గొప్పదని, బాల్యం లేకుంటే ఎంతో కోల్పోవాల్సివస్తుంది. అలాంటి బాల్యం రోడ్ల మీద.. చెత్త కుప్పల మధ్య గమ్యం లేకుండా గడుపుతోంది. ఇలాంటి వారి విషయంలో సైబరాబాద్ (Hyderabad) పోలీసులు జనవరి 1 వ తారీఖు నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్-ఎక్స్ (Operation Smile) నిర్వహించనున్నారు.
సైబరాబాద్ (Cyberabad) పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు సీపీ కార్యాలయంలో కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిరాశ్రయులైన చిన్నారులు, బాలకార్మికుల రక్షణ కోసం తీసుకోవలసిన ప్రత్యేక చర్యలపై చర్చించారు.. ఈ క్రమంలో రోడ్లపై భిక్షాటన, కూడళ్లలో సరుకులు విక్రయిస్తున్న వారితో పాటు, అక్రమ రవాణాకు పాల్పడుతోన్న చిన్నారులను రక్షించి వారికి పునరావాసం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు..
ఇందుకోసం సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లతో 11 బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు సైబరాబాద్ డబ్ల్యూఅండ్ సీఎస్‌డబ్ల్యూ డీసీపీ ఎల్సీ నాయక్ వెల్లడించారు. ఆపరేషన్ స్మైల్-ఎక్స్ లో భాగంగా.. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సమాజంలో బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న వారి నిర్మూలనకు కృషి చేయాలన్నారు. అలాంటి వారిని రెస్క్యూ హోంకు తరలించాలని సూచించారు.
జిల్లా అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, బాలల సంక్షేమ కమిటీ చైల్డ్‌లైన్ ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి బాలకార్మికులు లేకుండా పనిచేయాలన్నారు. మరోవైపు ఆపరేషన్ స్మైల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.. దర్పన్ అప్లికేషన్ ద్వారా తప్పిపోయిన పిల్లలను కనుగొనడం అని డీసీపీ ఎల్సీ నాయక్ పేర్కొన్నారు..