– దాదాపు 4 గంటలపాటు నిలిచిపోయిన ‘తెలంగాణ వాచ్’
– ప్రభుత్వ కుట్రగా అనుమానం
– తీవ్రంగా ఖండించిన రేవంత్ రెడ్డి
– సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్ట్ సంఘాల ఆగ్రహం
– పరిశోధనాత్మక కథనాలు ఇస్తున్న ‘తెలంగాణ వాచ్’
ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే వేధింపులు.. ప్రత్యేక రాష్ట్రంలో కామన్ అయిపోయాయని జర్నలిస్టు సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తమకు వ్యతిరేకంగా చిన్న వార్త వచ్చిందంటే చాలు.. ప్రభుత్వ పెద్దలు కన్నెర్ర చేస్తున్నారని అంటున్నాయి. ఈ క్రమంలోనే వేధింపులు ఎక్కువవుతున్నాయని వివరిస్తున్నాయి. తాజాగా పరిశోధనాత్మక కథనాలు ఇచ్చే ‘తెలంగాణ వాచ్’ పై కుట్రలు జరుగుతున్నాయని చెబుతున్నాయి.
ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో 30 ఏళ్ళకు పైగా అనేక కుంభకోణాలను బయటపెట్టారు జర్నలిస్ట్ అనంచిన్ని వెంకటేశ్వరరావు. ఈయన అజ్ఞాత పరిశోధనా బృందం ఆధ్వర్యంలో నడుస్తోంది ‘తెలంగాణ వాచ్’. గత ఆరున్నర సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఆధారాలతో సహా ప్రచురిస్తోంది. ఈ క్రమంలోనే వెంకటేశ్వరరావుపై పలు కేసులు నమోదయ్యాయి. జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అయితే.. ‘తెలంగాణ వాచ్’ సోమవారం ఉదయం 10.44 గంటల నుంచి మధ్యాహ్నం 2.22 గంటల వరకు బ్లాక్ అయింది. దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని అనంచిన్ని బృందం అంటోంది.
ఏం చేసినా ప్రశ్నించడం ఆపమని.. ఇది మాట్లాడే గొంతుకలను నులిమే వికృతమని మండిపడింది. అక్రమార్కుల గుండెల్లో గునపాలను దింపుతూ సంచలన పరిశోధనా కథనాలతో ‘తెలంగాణ వాచ్’ ముందుకు వెళ్తుందని స్పష్టం చేసింది. తెలంగాణలో తొలి ధిక్కారం వెంకటేశ్వరరావుదే అని.. అందుకే ఎమర్జెన్సీ తర్వాత అతి ఎక్కువ రోజులు జైలు జీవితం గడిపిన తొలి తెలంగాణ జర్నలిస్ట్ ఈయనే అని వివరించింది. ఎన్ని కుట్రలు చేసినా అవినీతి, అక్రమాలపై నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేసింది.
‘తెలంగాణ వాచ్’ బ్లాక్ అవడంపై జర్నలిస్టు సంఘాలు స్పందించాయి. కథనాలపై దమ్ముంటే విచారణ చేయాలని, అంతే తప్ప ప్రజాస్వామ్య గొంతుకలను నొక్కుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించాయి. సీనియర్ పాత్రికేయుడు పాశం యాదగిరి, తెలంగాణ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జాతీయ అధ్యక్షుడు కోటేశ్వర్ రావు, నామాల విశ్వేశ్వరావు, బెలిద హరినాథ్, రవికుమార్, సీహెచ్ వెంకటేశ్వర్లు సహా పలువురు దీనిపై ప్రభుత్వాన్ని నీలదీశారు.
ఇటు, ఈ సంఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ‘‘ఇది మాట్లాడే గొంతుకులను నులిమే వికృతం. ఇవి ఎన్నో రోజులు సాగవు. ఆత్మగౌరవంతో ఏర్పడిన తెలంగాణలో ఈ బానిస బతుకులు వద్దు. ‘తెలంగాణ వాచ్’ రాసిన వార్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే విచారణ జరుగుతుంది’’ అని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.