– బీసీలపై చిత్తశుద్ధే ఉంటే..
– బీసీ అధ్యక్షుడ్ని ఎందుకు మార్చారు?
– కీలకమైన ఎన్నికల సమయంలో..
– బండి తొలగింపు సంకేతం ఏంటి?
– బీసీ సీఎం ప్రకటన ఎన్నికల డ్రామానా?
– వారిపై ఓటమి నెపం నెట్టే ప్రయత్నమా?
– బీజేపీ తీరుపై ఇతర పార్టీల విమర్శలు
బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) బీసీ ద్రోహులు.. తాము మాత్రమే బీసీ బంధు అని అంటోంది బీజేపీ (BJP). అమిత్ షా (Amit Shah) బీసీ సీఎం ప్రకటన తర్వాత ఈ అంశంలో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు కమలనాథులు. డబుల్ ఇంజన్ సర్కారుకు ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తెలంగాణ (Telangana) లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని అధినాయకత్వం ప్రకటించడంతో నేతలు, కార్యకర్తలు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంబురాలు చేసుకున్నారు. లక్ష్మణ్, ఈటల రాజేందర్, బూర నర్సయ్య గౌడ్ సహా తదితర ఓబీసీ మోర్చా నేతలు ఇందులో పాల్గొన్నారు. అయితే.. ఒక్క బీసీ సీఎం ప్రకటనతో ఒక్కసారిగా బీజేపీ బీసీ బంధు ఎలా అవుతుందనే ప్రశ్నలు తెరపైకి వస్తోంది.
బీజేపీ బీసీ అధ్యక్షుడ్ని మార్చిన తీరును ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు కొందరు నేతలు. తాజాగా మంత్రి కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. ఈసారి 110 స్థానాల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోతుందని ఎద్దేవ చేశారు. బీసీ ప్రెసిడెంట్ ను తొలగించి.. బీసీ సీఎం అంటే ప్రజలు నమ్మరని విమర్శించారు. బీసీల మీద ఓటమి నెపం నెట్టడానికి బీజేపీ సీఎం అభ్యర్థిని తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తోందని సెటైర్లు వేశారు. అయినా, ఒక వ్యక్తి సీఎం, పీఎం అయితే.. ఆ సామాజికవర్గానికి లాభం జరుగుతుంది అనుకోవడం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదన్నారు. తెలంగాణ ప్రజల మీద తమకు అచంచల విశ్వాసం ఉందని వివరించారు.
కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ బీసీ సీఎం అంశం, బీసీ అధ్యక్షుడ్ని మార్చి తీరు చర్చనీయాంశంగా మారాయి. బీజేపీకి నిజంగా బీసీలపై చిత్తుశుద్ధి ఉంటే బీసీ అయిన బండి సంజయ్ (Bandi Sanjay) ను అధ్యక్షుడిగా తొలగించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డికి బాధ్యతలు ఎందుకు అప్పగించారని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ముందుగానే ఓటమిని గ్రహించిందని అందుకే బీసీ డ్రామాకు తెర తీసిందని ఇతర పార్టీల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఎన్ని కుట్రలు, డ్రామాలు చేసినా తెలంగాణ ప్రజలు ఆ పార్టీని నమ్మరని అంటున్నాయి.
నిజానికి, బండి సంజయ్ ను అధ్యక్షుడిగా తొలగించడంపై సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తం అయింది. కొందరు నాయకులు బహిరంగంగానే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఎన్నికల సమయంలో పార్టీ బీసీ అధ్యక్షుడ్ని మార్చడం కరెక్ట్ కాదనే చర్చ జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో జరిగిన డ్యామేజ్ ను పూడ్చుకునేందుకు, ఓడినా బీసీలపై ఓటమి నెపం నెట్టేయొచ్చనే ప్లాన్ తోనే బీజేపీ అధిష్టానం బీసీ సీఎం మంత్రం అందుకుందనే విమర్శలు ఇతర పార్టీల నుంచి వినిపిస్తున్నాయి.