హైదరాబాద్, గోషామహల్ (Goshamahal) బీజేపీ (BJP) ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Raja Singh) మరోసారి వార్తల్లో నిలిచారు.. అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఎప్పుడు వివాదాలు.. కేసులంటూ హడావుడి చేసే రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది. మొత్తానికి తన మనసులోని మాట బయట పెట్టిన రాజాసింగ్.. కాంగ్రెస్ ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు..
గత ప్రభుత్వంలో అప్పులకుప్పగా మారిన రాష్ట్రంలో మీరు అధికారాన్ని చేపట్టడానికి ఉచిత హామీలు ఇచ్చారు.. ఇవన్నీ ఎలా నెరవేరుస్తారో సీఎం స్పష్టం చేయాలని రాజాసింగ్ అన్నారు.. కొత్త ప్రభుత్వం ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. రాష్ట్రం మరో శ్రీలంకలా మారుతుందని రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నిధులు ఇటలీ నుంచి తెస్తారా? కాంగ్రెస్ (Congress) పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారా? అని రాజాసింగ్ ప్రశ్నించారు..
కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ (BRS)లు ఒక్కటే అని కీలక వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్.. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ముందు ప్రమాణం చేయమన్న మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు బీజేపీ ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేసామని తెలిపారు. ఇక అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుందని తెలిపిన రాజాసింగ్.. ఎవరు ఫ్లోర్ లీడర్ అయినా 8 మంది ఎమ్మెల్యేలతో కలిసిమెలిసి పనిచేస్తామని వెల్లడించారు..
మరోవైపు తాను ప్రభుత్వాన్ని కూలగొడతానన్నానంటూ వస్తోన్న వార్తలపై స్పందించిన రాజాసింగ్.. ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని పేర్కొన్నారు. ఆ పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారు కేసులు పెడితే వాళ్లపైనే పెట్టుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆశయాలను బీఆర్ఎస్ ప్రభుత్వం గంగలో కలిపిందని మండిపడ్డ రాజాసింగ్.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.. కాంగ్రెస్ ప్రభుత్వం పై మా యుద్ధం మొదలైందని తెలిపారు..