Pakistan : పాకిస్తాన్ ప్రధాని షెహ్ బాజ్ షరీఫ్ (Shehbaz Sharif) సిఫారసుపై పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి (Arif Alvi) పార్లమెంటును రద్దు చేశారు. ఈ నెల 12 తో పార్లమెంట్ కాల పరిమితి ముగియనుండగా మూడు రోజుల ముందే దీన్ని రద్దు చేశారు. సభ రద్దుతో ఇక సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే దేశంలో రాజకీయ, ఆర్ధిక సంక్షోభం కొనసాగుతోంది. పార్లమెంటును రద్దు చేశారు గనుక 90 రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. పార్లమెంటును రద్దు చేయాలని తాను అధ్యక్షుడికి సిఫారసు చేశానని, అపధ్ధర్మ ప్రధానిని నామినేట్ చేసే విషయంలో పాలక, ప్రతిపక్ష నేతలతో చర్చలు ప్రారంభిస్తానని షరీఫ్ చెప్పారు.
కానీ తాజా సెన్సస్ ఆధారంగా వందలాది నియోజకవర్గాలను ఈసీ పునర్వ్యవస్థీకరించవలసి ఉంది. అందువల్ల సార్వత్రిక ఎన్నికలు ఆలస్యంగా జరగవచ్చునని భావిస్తున్నారు. ఇలా జాప్యమే జరిగితే ప్రజల ఆగ్రహం పెరగవచ్చునని, రాజకీయ అనిశ్చితి మరింత తీవ్రం కావచ్చునని కూడా భయపడుతున్నారు. ఇదే సమయంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఎన్నికల్లో పోటీ చేయలేకపోవచ్చునన్న అభిప్రాయాలు తలెత్తుతున్నాయి.
. తోషాఖానా అవినీతి కేసులో కోర్టు ఆయనకు మూడేళ్ళ జైలు శిక్ష విధించగా.. అయిదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. కానీ తన శిక్షపై స్టే కోరుతూ ఇమ్రాన్ ఇస్లామాబాద్ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై కోర్టు నిన్న విచారణ జరపవలసి ఉండగా.. ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా వేసింది.
పాకిస్తాన్ లోని రాజకీయ పరిణామాలను అమెరికా నిశితంగా గమనిస్తోంది. తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న ఆ దేశంలో జనరల్ ఎన్నికలను ఎలా నిర్వహిస్తారన్న దానిపై అమెరికా విశ్లేషకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.