ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం(Israel-Hamas war) ప్రారంభమైనప్పటి నుంచి పాకిస్తాన్(Pakistan) సహా కొన్ని ముస్లిం మెజార్టీ దేశాల్లో ఇజ్రాయెల్ ఉత్పత్తులను బహిష్కరిస్తున్నారు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని మీర్పూర్‌లో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. అక్కడి అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ ఫ్రాంచైజీ కేఎఫ్‌సీ(KFC) రెస్టారెంట్‌కు గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు.
ఈ దాడికి గల అసలు కారణం ఇంకా వెల్లడి కాలేదు. పోలీసులు గానీ, రెస్టారెంట్ నిర్వాహకులు గానీ ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆందోళనకారులు మాత్రం పాలస్తీనా మద్దతుదారులుగా స్పష్టమవుతోంది. పూర్తి విచారణ జరిపిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు. రెస్టారెంట్‌కు నిప్పుపెట్టిన నిందితులందరినీ పట్టుకుంటామని చెప్పారు. కాగా, పాకిస్తాన్‌లో కేఎఫ్‌సీ ఫ్రాంచైజీలు 120కి పైగానే ఉన్నాయి.
కేఎఫ్‌సీ ఔట్‌లెట్‌లపై కొందరు దుండగులు రాళ్లదాడికి దిగారు. అంతటితో ఆగకుండా వాహనాలు, దుకాణాలకు నిప్పుపెట్టారు. ఆ రెస్టారెంట్‌లో ఇజ్రాయెల్ వస్తువులు ఉన్నట్లు దాడికి పాల్పడిన దుండగులు ఆరోపించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇజ్రాయెల్ వ్యతిరేక, పాలస్తీనా అనుకూల నినాదాలు చేశారని స్థానికులు చెబుతున్నారు. దీన్ని బట్టి దాడిచేసిన వ్యక్తులు పాలస్తీనా మద్దతుదారులుగా భావిస్తున్నారు.
గుంపుగా వచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడటంతో పోలీసులు రంగంలోకి దిగి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. 50 మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేశారు. మరికొంతమంది నిరసనకారులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఘటనపై పాకిస్థాన్‌లోని ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో కొందరు ప్రశంసిస్తుండగా.. మరికొందరు ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.