బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA)లను టచ్ చేస్తే కాంగ్రెస్ సర్కార్(Congress Government) కూలడం ఖాయమని బీజేఎల్పీ(BJLP) నేత ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి(Eleti Maheshwar Reddy) అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తమతో ఎనిమిది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలకు మహేశ్వర్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
తాము గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ సర్కార్ ఉండదంటూ హెచ్చరించారు. రాహుల్ గాంధీ ట్యాక్స్ పేరుతో 3వేల కోట్లు వసూలు చేశారని, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వసూళ్ల చిట్టా తమ దగ్గర ఉన్నదని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ డబ్బులు దేశ నాయకుల కోసం కాంగ్రెస్ వినియోగిస్తోందని ఆరోపించారు.
రంజిత్‌రెడ్డిపై గతంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గతంలో పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలన్న రేవంత్ ఇప్పుడు ఇతర పార్టీల నేతలను ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ప్రజాతీర్పును గౌరవించి కాంగ్రెస్‌కు సహకరిస్తున్నామని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అప్పుడు రంజిత్ రెడ్డి అవినీతి చేశారని చెప్పిన రేవంత్ ఇప్పుడు ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయాలని అడగడం సిగ్గుచేటన్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఎవరికీ నమ్మకం లేదన్నారు. నితిన్ గడ్కరీ వద్దకు వెళ్లి షిండే పాత్ర పోషిస్తానని కోమటిరెడ్డి అన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయనతో లేడు అని చెప్పారు. షిండే పాత్ర పోషిస్తానని గతంలో గడ్కరీతో కోమటిరెడ్డి అన్నది నిజమా కాదా అన్నారు. తమ్ముడి భార్యకు వెంకట్ రెడ్డి టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు.