ఫీజుల విషయంలో మరోసారి వార్తల్లోకెక్కింది శ్రీనిధి (Srinidhi) ఇంజినీరింగ్ కాలేజీ. మేడ్చల్ (Medchal) జిల్లా ఘట్ కేసర్ లో ఉన్న కాలేజీకి పెద్ద ఎత్తన విద్యార్థులు (Students), తల్లిదండ్రులు (parents) వచ్చారు. ముందే కట్టించుకున్న ఫీజులు తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. గేటు ముందు ధర్నాకు దిగారు. అయితే.. అప్పటికే పోలీసులకు సమాచారం అందించింది యాజమాన్యం. తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు నిరసనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఒకానొక సమయంలో విద్యార్థులకు పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. గతంలో ఆగస్టు 15లోపు బదిలీ ప్రక్రియ పూర్తయ్యేలా చూస్తామని విద్యాసంస్థ హామీ ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. అటు బదిలీ జరగక, ఇటు ఫీజు తిరిగివ్వకపోవడంతో ఇలా ఆందోళనకు దిగాల్సి వచ్చిందని చెప్పారు. గేటును తోసుకుంటూ విద్యార్థులు లోపలికి వెళ్లడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
రాష్ట్రంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుకు ఆ మధ్య అసెంబ్లీ ఓకే చెప్పినా.. గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. 2022–23 విద్యా సంవత్సరానికి గాను గురునానక్ లో 2,800 వరకూ, శ్రీనిధిలో 300 మంది విద్యార్థులను ముందే చేర్చుకున్నారు. గవర్నర్ ఓకే చెప్పకపోవడంతో ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. ఓ సంవత్సరాన్ని కోల్పోవాల్సి రావడంతో విద్యార్థులు, పేరెంట్స్, విద్యార్థి సంఘాలు గురునానక్, శ్రీనిధి కాలేజీల వద్ద పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు.
వివాదం ముదరడంతో ప్రభుత్వం కలగజేసుకుంది. గుర్తింపు లేకుండా కొనసాగుతున్న గురునానక్, శ్రీనిధి ప్రైవేట్ యూనివర్సిటీల్లోని స్టూడెంట్లను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయాలని భావించింది.అయితే.. విద్యార్థులు, తల్లిదండ్రులు తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని శ్రీనిధి కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. యాజమాన్యం మాత్రం అనుమతులు వస్తాయని చెబుతూ వస్తోందని అంటున్నారు వారంతా.