తెలంగాణ (Telangana)లో బీఆర్ఎస్ (BRS)కు బలమైన పోటీనిచ్చి ఊహించని విధంగా అధికారం కైవసం చేసుకొన్న కాంగ్రెస్ (Congress).. అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన అస్త్రాలనే పార్లమెంట్ ఎన్నికలకు వాడుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో (Parliament Elections) మొత్తం 14 లోక్సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తోంది.
ఇందులో భాగంగా ప్రజాదరణ కలిగిన అభ్యర్థులకే పట్టం కట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇతర పార్టీల నుంచి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేతల పూర్తి సమాచారం తెప్పించుకుంటున్నట్లు సమాచారం. అదీగాక సునీల్ కనుగోలు బృందంతో పాటు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా సర్వేలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికల తర్వాత లోక్సభ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్న రాష్ట్ర నాయకత్వం, ఆ దిశగా కార్యాచరణను వేగవంతం చేసింది.
ఇప్పటికే 17 నియోజకవర్గాలకు 309 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకొన్నట్లు తెలుస్తోంది. అయితే విజయమే లక్ష్యంగా వెళ్తున్న కాంగ్రెస్ కమిటీ వడపోత పూర్తి చేసి స్క్రీనింగ్ కమిటీకి ఆ వివరాలు నివేదించింది. హరీశ్ చౌదరి ఛైర్మన్గా ఉన్న స్క్రీనింగ్ కమిటీ.. నియోజకవర్గానికి ముగ్గురు లెక్కన కేంద్ర ఎన్నికల కమిటీకి ఈ జాబితాను అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), పార్టీ సీనియర్లతో కలిసి రెండు గంటల పాటు చర్చించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసేందుకు సునీల్ కనుగోలు బృందం సర్వేలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో ఎంత శాతం పార్టీకి అనుకూలంగా ఉన్నారు? అధికారం చేపట్టిన తర్వాత తాజా పరిస్థితి ఏంటి? అనే విషయాలపై వివరాలు సేకరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో లోక్సభ బరిలో దిగే వారు బీఆర్ఎస్, బీజేపీ (BJP) అభ్యర్థుల్ని దీటుగా ఎదుర్కొని విజయం సాధిస్తారా? లేదా? వీరికి ప్రజల్లో ఎంత స్ట్రాటజీ ఉంది. ఇలా వివిధ అంశాల ఆధారంగా సర్వే చేస్తున్నట్లు సమాచారం.
అభ్యర్థుల ఎంపిక విషయమై సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని సర్వేలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ కు తెలంగాణలో ప్రజలిచ్చిన అవకాశాన్ని వదులు కోవడానికి సిద్దంగా లేదని ఈ ప్రణాళికలు చూస్తే అర్థం అవుతోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ కు.. బీజేపీకి ఛాన్స్ ఇవ్వద్దనే ఆలోచనతో ప్లాన్ లో ఉన్నట్లు చర్చించుకొంటున్నారు..