ఎంపీ టిక్కెట్ల కోసం తెలంగాణ (Telangana) బీజేపీ (BJP)లో పోటీ తీవ్రంగా నెలకొందని తెలుస్తోంది. మోడీ (Modi)చరిష్మా వల్ల బీజేపీ ఎలాగైనా గెలుస్తోందనే నమ్మకంతో ఉన్న నేతలు ఎంపీ (MP) టికెట్ల కోసం పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) రాష్ట్రంలో 10 ఎంపీ సీట్లు గెలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా అభ్యర్థుల ఖరారులో జాప్యం జరగకుండా చూస్తామన్నారు కానీ ఇంత వరకూ అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించలేక పోయారు. దీనికి కారణం పోటీ తీవ్రంగా ఉండటమేనని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ సిట్టింగ్ ఎంపీలు స్థానాలు సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ మినహాయిస్తే.. మల్కాజ్‌గిరితో పాటు జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, మహబూబ్‌నగర్ లో ఎంపీ టికెట్ల కోసం నాయకులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు.
ఇప్పటికే మెదక్ నుంచి పోటీకి తాను సిద్ధమైనట్టు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్‌రావు ప్రకటించారు. కానీ ఆయనకు ఛాన్స్ ఇవ్వకూడదన్న పట్టుదలతో మరో వర్గం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే ఆయన ఇటీవలే రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. అందుకే ఆయన పోటీ చేయకపోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మరోవైపు మెదక్ సీటు కోసం ఇతర పార్టీలకు చెందిన కొంత మంది బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల నుంచి పోటీకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సై అంటున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు, వీరేందర్ గౌడ్ ప్రయత్నిస్తున్నారు. ఆయన గతంలో చేవెళ్ల నుంచి టీడీపీ తరపున పోటీ చేశారు. ఇక భువనగిరి సీటు తనకే వస్తుందనే ధీమాతో మాజీ ఎంపీ డా.బూరనర్సయ్యగౌడ్ ఉన్నారు.
అయితే గత ఎన్నికల్లో పోటీచేసిన భువనగిరి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రావు కూడా పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు మహబూబాబాద్ టికెట్‌కు తేజావత్ రామచంద్రునాయక్, హుస్సేన్‌నాయక్, దిలీప్‌నాయక్ పోటీ పడుతున్నారు. మహబూబ్‌నగర్ సీటు కోసం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టి.ఆచారి ప్రయత్నాల్లో ఉన్నారు.
ఈ క్రమంలో మహబూబ్ నగర్ సీటు పరిస్థితి హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. డీకే అరుణకు సీటిస్తే, జితేందర్ రెడ్డి పార్టీ మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మల్కాజ్‌గిరి లోక్‌సభ సెగ్మెంట్ నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ పోటీ చేస్తానంటున్నారు. ఇప్పటికే పి.మురళీధర్‌రావు, పేరాల శేఖర్‌రావు, ఎన్.రామచందర్‌రావు, కూన శ్రీశైలంగౌడ్, డా.ఎస్.మల్లారెడ్డి, టి.వీరేందర్‌గౌడ్, సామ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీశ్‌రెడ్డి తదితరులు ఇక్కడి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే.. బీజేపీలో చేరి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ చెబుతున్నారని సమాచారం. హైదరాబాద్ ఎంపీగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోటీ చేయిస్తే అనూహ్య ఫలితాలు సాధించవచ్చనే చర్చ పార్టీవర్గాల్లో జరుగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన భగవంత్‌రావు పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇలా చాలా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ.. బీజేపీకి వర్గ పోరాటం పెద్ద సమస్యగా మారింది.