-పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సీట్లుకు గురిపెట్టిన కాంగ్రెస్..
-బలమైన అభ్యర్థులపై అంచనాకు వచ్చిన రేవంత్..
-రంగంలోకి దిగుతోన్న ఆశావహులు..
-లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి తప్పని తిప్పలు..
తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ (Congress) బీజేపీ (BJP)కి కొత్త ఉత్సాహం ఇవ్వగా..బీఆర్ఎస్ (BRS)ను డీలా చేశాయి. ఏది ఏమైనా మూడు పార్టీలు, పార్లమెంటు ఎన్నికల్లో (Parliament Elections) మెజార్టీ సీట్లు గెలువడమే లక్ష్యంగా వ్యూహరచనలు మొదలు పెట్టాయి. అయితే కాంగ్రెస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది..
ఇందుకోసం ఎంపిక చేసిన స్థానాల్లో ముఖ్యమైన నేతలను బరిలో దింపేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు రాబట్టాలనే వ్యూహంలో హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇప్పటికే బలమైన అభ్యర్థుల పై ఓ అంచనాకు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. కాగా ఈ పేర్లను 4న ఢిల్లీలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశంలో, సీఎం రేవంత్ సమర్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన విషయంలో వెనుకబడిన కాంగ్రెస్.. అసెంబ్లీ ఎన్నికల దగ్గరి నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకి ఆచితూచి వ్యవహరిస్తుంది. అందుకే అభ్యర్థుల ప్రకటనలో దూకుడుగా ప్రవర్తిస్తుందని అనుకొంటున్నారు.. ఇప్పటికే ఆయా పార్లమెంటు నియోజకవర్గాలకు మంత్రులను ఇన్చార్జీలుగా నియమించిన అధిష్టానం.. ఏఐసీసీ, టీపీసీసీ నేతలకు బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం..
మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే వారిలో ఇతర పార్టీలకు చెందిన వారు సైతం ఉన్నట్టు చర్చించుకొంటున్నారు.. ఇప్పటి వరకూ వారితో చర్చలు కూడా పూర్తయ్యాయని చెబుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్లు దక్కని నాయకులకు ఎంపీ సీట్లు ఇస్తామనీ, కార్పొరేషన్ చైర్మెన్ పదవులిస్తామనీ, ఎమ్మెల్సీ పదవులిస్తామంటూ.. కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆశావహులు కూడా రంగంలోకి దిగుతున్నారు. వీరి అంశాన్ని సైతం సీరియస్ గా తీసుకొన్న అధిష్టానం.. నాయకులను ఎట్లా సర్దుబాటు చేయాలనే దానిపై ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది..