రాష్ట్రంలో గల్లంతు అవుతున్న బీఆర్ఎస్..
కారు దిగుతున్న గులాబీ నేతలు.. ఖాళీ అవుతున్న సీట్లు..
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనబరచని ఆసక్తి..
రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ (BRS) ప్రస్తుత పరిస్థితిపై పలు రకాలుగా ప్రచారం జరుగుతోంది. వెనకటికి ఒకరు వాపుని చూసి బలుపు అనుకొన్నట్లు.. గులాబీ అధికారంలో ఉన్నంత కాలం ఎన్ని అవమానాలు ఎదురైన ఒక్క నేత కూడా ఎదురు చెప్పలేదనేది ప్రచారంలో ఉంది. బీఆర్ఎస్ అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అనే ముద్ర పడింది.
ఆ పార్టీ అధికారంలో ఉంది అంటే.. దోచుకొని తినండి.. కానీ మాకు ఎదురు చెప్పకండి అనే తీరుగా వ్యవహరించిందనే ఆరోపణలున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ ప్రజల మెదళ్ళకు వైరస్ లా ఎక్కించింది కాబట్టి.. కారు తరపున పోటీ చేస్తే.. కానీ వారైనా విజయం అందుకోవచ్చనే భావనతో.. కారు సీట్లన్నీ నిండిపోయాయి. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు తెలంగాణ (Telangana) ఉద్యమం ఊపందుకున్నప్పటి నుంచి బీఆర్ఎస్ కు ఎప్పుడూ అభ్యర్థుల సమస్య రాలేదు.
పోటీ తీవ్రంగా ఉండేది. కానీ ఇప్పుడు టిక్కెట్లు ఇస్తామంటే వద్దంటున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి ముందుకొచ్చే నేతలే లేరు. సిట్టింగ్ ఎంపీలు అందరూ దాదాపుగా సైడ్ అయిపోయారని అనుకొంటున్నారు. బీఆర్ఎస్ కు ప్రస్తుతం 9 మంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. అందులో పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ ఇప్పటికే హస్తం గూటికి చేరుకొన్నారు. మరి కొంత మంది నేతలు కూడా కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలతో టచ్ లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది.
మరికొంత మంది పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇలా పార్లమెంటు ఎన్నికల బరిలో ఉంటారనుకొన్న నేతలు మెల్లమెల్లగా పార్టీ నుంచి దూరమవుతున్నారు. సీటు ఇస్తామన్నా పోటీకి వెనుకాడుతున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు కంచుకోట లాంటి ఆదిలాబాద్ (Adilabad)లో ఇప్పుడు ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి గట్టి అభ్యర్థి లేరని అంటున్నారు. కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారని భావించారు. కానీ మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేరు ప్రస్తుతం వినిపిస్తోంది. అదీగాక కవిత, కేటీఆర్ (KTR), కేసీఆర్ ఎవరూ లోక్ సభ బరిలోకి దిగడం లేదని తెలుస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టలేకపోతే బీఆర్ఎస్ గల్లంతు అవడం ఖాయమనే వార్తలు ఊపందుకొన్నాయి. ఇప్పటికే అన్ని చోట్లా బీజేపీ, కాంగ్రెస్ తరపున అభ్యర్థులు సరానికి సిద్దం అవుతున్నారు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. కారు షెడ్డుకు.. కేసీఆర్ ఫామ్ హౌస్ కు.. అనే నినాదం ఇప్పటికే కాంగ్రెస్ (Congress) ప్రచారంలోకి తెచ్చింది. ప్రస్తుతం ఇదే నిజం అవుతుందా? అనే అనుమానాలు రాష్ట్ర రాజకీయాల్లో కలుగుతున్నాయని అంటున్నారు..