పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) గట్టేక్కాలని చూస్తున్న కాంగ్రెస్ (Congress) అందుకు అనుగుణంగా వ్యూహారచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ (MP) సీట్లలో బీసీ (BC)లకు ప్రాధాన్యం కల్పిస్తామని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హస్తంలో ఆశావహులు భారీగా ఉన్నందున అలా కేటాయింపు సాధ్యమేనా? అన్న ప్రశ్న కాంగ్రెస్లో వినిపిస్తోంది.
లోక్ సభ ఎన్నికల్లో కనీసం 5-6 సీట్లను బీసీలకు కేటాయించాలని రేవంత్ నిర్ణయించినట్లు సమాచారం. ఒక్కో నియోజకవర్గానికి 1-3 పేర్లను సిఫార్సు చేయాలని పీఈసీకి ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సూచించినట్లు తెలిసింది. సామాజిక, గెలుపు సమీకరణాలను పరిగణలోకి తీసుకుని.. అభ్యర్థులను ఎంపిక చేయాలని అనుకుంటున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్లమెంట్ నియోజకవర్గానికి కనీసం రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
కానీ వివిధ కారణాల వల్ల సీట్ల సర్దుబాటు సమయంలో కేటాయించలేక పోయారు. బీఆర్ఎస్ పార్టీ కన్నా బీసీలకు తక్కువ సీట్లు కేటాయించారు. అయితే ఎంపీ సీట్ల విషయంలో ఈ సారి కూడా అలాంటి పరిస్థితే వస్తుందని భావిస్తున్నారు. తెలంగాణ (Telangana)లో ఉన్నది 17 పార్లమెంట్ సీట్లు. ఇందులో రెండు ఎస్టీ, మూడు ఎస్సీ వర్గానికి రిజర్వ్ అయ్యాయి. హైదరాబాద్ ముస్లింలకు అప్రకటిత రిజర్వు నియోజకవర్గంగా ఉంది.
ఇక పదకొండు స్థానాలు జనరల్ కేటగిరిలో మాత్రమే ఉంటాయి.. వీటిలో ఐదారు అయినా బీసీలకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కానీ అన్ని చోట్లా బలమైన పోటీ దారులుగా ఓసీలే ఉన్నారు. ఈ క్రమంలో లోక్ సభ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఒత్తిడి ఉందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మెదక్, జహీరాబాద్, నిజామాబాద్ వంటి చోట్ల మాత్రమే బీసీలకు సీట్లు కేటాయించగలరు. ఇలా మొత్తానికి బలమైన నేతల కొరతే దీనికి కారణమని అందుకే బీసీలకు ఆరేడు సీట్లు కేటాయించడం సాధ్యం కాదని కాంగ్రెస్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.