– పార్లమెంట్ ఎన్నికలపై పార్టీల ఫోకస్
– అసెంబ్లీ గెలుపు ఉత్సాహంలో కాంగ్రెస్
– లోక్ సభ లోనూ సత్తా చాటాలని ప్లాన్స్
– పరువు నిలబెట్టుకునే పనిలో బీఆర్ఎస్
– 17 స్థానాలు గెలుస్తామనే ధీమాలో బీజేపీ
– గెలుపు వ్యూహాలు మొదలు పెట్టిన ప్రధాన పార్టీలు
– ఎవరి లెక్కలేంటి? ఉన్న బలమెంత?
– ‘రాష్ట్ర’ ప్రత్యేక కథనం
తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ప్రభుత్వం మారింది. కొత్త సర్కార్ కొలువు దీరింది. కాంగ్రెస్ (Congress) సంబరాల్లో ఉంటే.. బీఆర్ఎస్ (BRS) ఆలోచనలో పడింది. ఓటమిపై సమాలోచనలు జరుపుతోంది. ఇక బీజేపీ (BJP) కి అనుకున్న లక్ష్యం నెరవేరకపోయినా.. 8 స్థానాలు సాధించి 19 సీట్లలో రెండోస్థానంలో నిలవడం కాస్త ఊరటనిచ్చింది. అయితే.. ఇంకో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే సత్తా చాటాలని కాంగ్రెస్ అనుకుంటుంటే.. బీఆర్ఎస్, బీజేపీ కూడా తమ వ్యూహాలను పదునుపెట్టాయి.
సీఎం రేవంత్ ముందు మొదటి టాస్క్
రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో కష్టపడ్డారు రేవంత్ రెడ్డి. ఆ కష్టానికి ఫలితంగా సీఎం పదవి దక్కింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తనదైన మార్క్ తో పాలన సాగిస్తున్నారు రేవంత్. అయితే.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు మొదటి టాస్క్ గా పార్లమెంట్ ఎన్నికలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో మోడీ సర్కార్ ను గద్దె దించాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని కూటమిగా ఏర్పడింది. రాష్ట్రంలో గత ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలే సాధించింది కాంగ్రెస్. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉండడంతో ఎంపీ స్థానాలు అధికంగా సాధిస్తామని ధైర్యంగా చెబుతున్నారు హస్తం నేతలు. మొత్తం 17 స్థానాల్లో ఓ 15 గెలిచి హైకమాండ్ కు రేవంత్ ఇవ్వగలిగితే పార్టీలో ఆయన స్థానం మరింత బలోపేతం అవుతుంది.
పరువు నిలుపుకోవాలనుకుంటున్న బీఆర్ఎస్
పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన గులాబీ పార్టీ.. ఈసారి అధికారాన్ని చేజార్చుకుంది. గులాబీ పెద్దల అహంకార ధోరణితోనే ఇలా జరిగిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోగొట్టుకున్న పరువును పార్లమెంట్ ఎలక్షన్ తో నిలుపుకోవాలని గులాబీ నేతలు వ్యూహాలకు పదును పెట్టారు. గత ఎన్నికల్లో పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ స్థానాల్లో గెలిచింది బీఆర్ఎస్. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకూ సిద్దిపేటలో వచ్చే మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తూ వస్తోంది. అది తప్ప మిగిలిన చోట్లలో ఇప్పుడు కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలిచారు. లోక్ సభ ఎన్నికలు జాతీయ రాజకీయాల ప్రాధాన్యంతో ఓటింగ్ జరుగుతాయి. కాబట్టి.. కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ లెక్కలన్నీ వేసుకుని బీఆర్ఎస్ పరువు నిలుపుకోవాలనే ప్లాన్స్ లో ఉంది.
బీజేపీ లెక్కలే వేరు
అసెంబ్లీ ఎన్నికల్లో 25 నుంచి 30 స్థానాలు గెలిచి హంగ్ వస్తే.. కీలకంగా వ్యవహరించొచ్చని భావించింది కమలం పార్టీ. అయితే.. 8 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఎన్నికలతో పోలిస్తే ఆపార్టీకి ఇవి మెరుగైన ఫలితాలే. పైగా 19 స్థానాల్లో రెండో ప్లేస్ లో నిలిచింది. వాటిలో కొన్ని గెలుపునకు దగ్గరగా వచ్చినవి ఉన్నాయి. పెరిగిన ఓట్ షేర్ తో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామనే ధీమాతో ఉన్నారు కాషాయం నేతలు. గత ఎన్నికల్లో బీజేపీ 4 లోక్ సభ స్థానాల్లో గెలిచింది. ఈసారి తెలంగాణలోని 17కి 17 గెలిచి క్లీన్ స్వీప్ చేస్తామని అంటున్నారు కమలనాథులు. ఆ దిశగానే ముందుకెళ్తామని చెబుతున్నారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా 400కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని అంటున్నారు. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ సమరం ముగియగానే.. పార్లమెంట్ యుద్ధానికి సిద్ధమౌతున్నాయి పార్టీలు.