ప్రవల్లిక(pravallika) ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ప్రవల్లిక ప్రియుడు శివరాం(shivaram)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రియుడి వేధింపుల వల్లనే ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ప్రవల్లిక ఆత్మహత్యతో పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదవుతున్నాయి.
ఇప్పటికి ప్రవల్లిక ఆత్మహత్య ఘటనకు సంబంధించి పోలీసులు 13మందిపై కేసులు నమోదు చేశారు. అందులో బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఓయూ జేఏసీ చైర్మన్ సురేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్, అనిల్ కుమార్, బీజేవైఎం నాయకులు భాను ప్రకాష్‌తో పాటు మరికొంత మంది నేతలపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. 143,148, 341, 332, r/w 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
హైదరాబాద్‌లో శివరామ్ అనే యువకుడి వేధింపుల కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు ఇటీవల మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ప్రవల్లిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్ వేర్వేరు వీడియోలను విడుదల చేశారు.
తాను గ్రామంలో కూలీ పనులకు వెళ్తానని.. తన పిల్లలు ప్రవల్లిక, ప్రణయ్‌కు మంచి చదువులు చదవాలని రెండేళ్ల కిందట హైదరాబాద్‌కు పంపినట్లు తల్లి విజయ వీడియోలో చెప్పింది. ఇప్పటికైనా తమ బిడ్డ ఆత్మహత్యను రాజకీయం చేయవద్దని ఆ వీడియోలో ప్రవల్లిక తల్లి, సోదరుడు కోరారు. ఏమైనా రాజకీయాలు ఉంటే పార్టీలే చూసుకోవాలని, బిడ్డను కోల్పోయిన దుఃఖంలో తాము ఉన్నామని వాపోయారు. పరామర్శలు, ప్రశ్నలతో తమను వేధించవద్దని విజ్ఞప్తి చేశారు.