ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్డు (Ap Land Titling Act) అనేది డ్రకోనియన్ లా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం అని తెలిపారు ఇది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే చట్టమని పేర్కొన్నారు. విశాఖలో దోచుకున్న ఆస్తులను చట్టబద్దం చేసుకునేందుకే ఈ చట్టాన్ని తీసుకు వచ్చారని ఆరోపించారు. ఈ చట్టాన్ని అమలు కాకుండా చూసుకునే బాధ్యతను తాను తీసుకుంటానని వెల్లడించారు.
మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో న్యాయవాదులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ కు న్యాయవాదులు వివరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జరిగే నష్టాన్ని న్యాయవాదులు ముందుగానే గుర్తించారని తెలిపారు.
న్యాయస్థానాలను కాదని రెవెన్యూ శాఖకు పూర్తి అధికారాలు ఇస్తే పవర్ అంతా రెవెన్యూ అధికారుల చేతుల్లోకి వెళ్లి పోతుందన్నారు. న్యాయవ్యవస్థను అతిక్రమించి రెవిన్యూకు అధికారాలనున ఎలా కట్టబెడతారి నిలదీశారు. ఆస్తులను దోచేయడం సులభతరం అవుతుందనే ఈ చట్టాన్ని తీసుకు వచ్చారని ఆరోపణలు గుప్పించారు. భూహక్కుల చట్టాన్ని రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపించారనని చెప్పారు.
కానీ అంతరకు ముందే ఆ చట్టంలోని అంశాలను అమలు చేసేస్తున్నారని విమర్శించారు. వారసత్వంగా వచ్చే పట్టా పుస్తకాల్లో జగన్ ఫొటో ఎందుకో తమకు అర్దం కావడం లేదన్నారు. వారసత్వంగా సంక్రమించిన భూమిలో జగన్ ముఖచిత్రంతో రాయి ఏంటని ప్రశ్నించారు. తాను ఇచ్చేవాడినని, మీరు తీసుకునే వాళ్లని దానికి అందరూ లోబడి ఉండాలనే మైండ్ సెట్ జగన్ ది అంటూ ధ్వజమెత్తారు. రాజ్యాంగ బద్దంగా ఆలోచన చేసే పాలకులు ఇలాంటి పనులు చేయరని అన్నారు.
రిషి కొండను దోచుకున్నట్లుగానే ఇతర ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను కూడా దోచుకునేందుకు కుట్రకు తెరలేపారని నిప్పులు చెరిగారు. ఎవరి ఆస్తులనైనా వారి కబంధ హస్తాల్లో పెట్టుకునేలా ఈ చట్టాన్ని తీసుకు వచ్చారన్నారు. తాను ఈ విషయాన్ని విన్నప్పుడు న్యాయవాదులు తమ కేసులు పోతాయనే ఆందోళనలు చేస్తున్నారని ప్రచారాలు చేశారని వివరించారు.
గతంలో ఇసుక సమస్య విషయంలోనూ కార్మికుల పొట్ట కొట్టి వారిపైనే దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యుల నుంచి గృహిణిల వరకు అందరికీ అర్థమయ్యేలా ఈ అంశాలన్ని తీసుకెళ్లాలన్నారు. అందరికి అర్థమయ్యేలా మరింత లోతుగా వివరించేందుకు రెండు రోజుల సమయం తీసుకుని దీనిపై పూర్తిగా అధ్యయనం చేస్తానన్నారు.
న్యాయ పరిభాషపై అవగాహన లేని వ్యక్తులకు కూడా అర్థమయ్యేలా సామాన్య భాషలో వివరిస్తానన్నారు. ఐదుగురు వ్యక్తులు కమిటీ ఏర్పాటు చేసి ఈ చట్టం వల్ల కలిగే నష్టాలపై చర్చిస్తానని పేర్కొన్నారు. ఆ తర్వాత పెద్ద సమావేశం పెట్టి అందరికీ వివరిస్తామన్నారు. మరోసారి అందరం కలిసి దీనిపై చర్చించుకుందమని వెల్లడించారు. ఆ తర్వాత కార్యాచరణ సిద్దం చేద్దామన్నారు.