టీడీపీ-జనసేన-బీజేపీ(TDP-Janasena-BJP) కూటమిలో భాగంగా జనసేన అధినేత(Janasena Chief) పవన్ కల్యాణ్(Pawan Kalyan) పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం(Pithapuram Assembly Constituency) నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన తొలిసారి పిఠాపురం పర్యటనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే వారం పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటిస్తారంటూ జనసేన శ్రేణులు చెబుతున్నారు.
నియోజకవర్గానికి చెందిన మూడు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో పవన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు తెలియగానే అసమ్మతి సెగ రగిలింది. ఇక్కడ టీడీపీ తరఫున టికెట్ ఆశించిన సత్యనారాయణ వర్మను కాదని పవన్‌కల్యాణ్ పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే.
టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలకు నిప్పుపెట్టి తమ నిరసనలు తెలియజేశారు. అంతటితో ఆగకుండా చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీడీపీ శ్రేణులు మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి పవన్ కల్యాణ్ వస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇక, పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనలో ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలతో పెద్దసంఖ్యలో జనసేన పార్టీలో చేరతారని తెలుస్తోంది.. మరోవైపు.. సమావేశంలో కేవలం నియోజకవర్గానికి చెందిన పార్టీ క్యాడర్ మాత్రమే పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, పెండింగ్‌లో ఉన్న పనులుపై పవన్ చర్చిస్తారని తెలుస్తోంది.
అయితే అసమ్మతి వ్యక్తం చేస్తున్న నేతలను పవన్ ఏవిధంగా డీల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ రాక నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని జనసేన, బీజేపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నారు. ఇదిలా ఉండగా, టీడీపీ-జనసేన ఉమ్మడిగా సభలు నిర్వహించగా.. ఆదివారం బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడిగా తొలి సభ నిర్వహించాయి.. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభకు హాజరైన విషయం విధితమే.