వైఎస్ షర్మిల(YS Sharmila) కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరిన నేపథ్యంలో ఏపీ మంత్రి(AP Minister) పెద్దిరెడ్డి(Peddireddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా జగన్మోహన్రెడ్డి(CM Jagan)కి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా తాము ప్రతిపక్షంగానే చూస్తామన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన రాజకీయాల్లో తమ కాళ్లు తామే నరుక్కుంటామా? అని ప్రశ్నించారు.
పద్ధతి ప్రకారం రాజకీయాలు నడిపిన వ్యక్తులమని, ఆ పద్ధతి ప్రకారమే జగన్‌తోనే ఉంటామని మంచి జరిగినా.. చెడు జరిగినా జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. జగనే తమ నాయకుడని, ఆయనతోనే కలిసి పని చేస్తామని పద్దిరెడ్డి తెలిపారు. తిరిగి జగన్ సీఎం అధికారంలోకి వచ్చేందుకు తామంతా కృషి చేస్తామన్నారు.
పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడడం మంచిది కాదన్నారు. ఒక జడ్పీటీసీగా ఓడిపోయిన ఆయన్ని ఎమ్మెల్యేగా ఎలా చేశామన్నది గుర్తించాలని పెద్దిరెడ్డి అన్నారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసే నైజం సోనియాగాంధీది, చంద్రబాబుదని ఆరోపించారు.
అందుకే ఆనాడు ఇద్దరూ కలిసి జగన్‌ను జైలుకు పంపించారని, కుటుంబాల్ని కాదు మనుషులను చీల్చి రాజకీయాలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఆరోపించారు. రాజకీయాల్లో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయని మంత్రి పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు.