కొంత కాలంగా కేంద్రం పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటి వార్తలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి(Minister Of Petroleum) హర్దీప్ సింగ్ పూరీ(Hardeep S Puri) స్పందించారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ఆలోచన లేదని ప్రభుత్వం బుధవారం క్లారిటీ ఇచ్చింది. ధరల పరిస్థితిని సమీక్షిస్తూ తాము స్థిరంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నామని అన్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల్లో అస్థిరత ఎక్కువగా ఉన్నందు వల్ల ప్రస్తుతం కేంద్రానికి అలాంటి ప్రతిపాదన లేదని హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. ఇంధన ధరల తగ్గింపుపై మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇంధన లభ్యత ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఆయన అన్నారు.
ఇటీవల క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరగడంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు, ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌సీఎల్ భారీ నష్టాలను చవిచూశాయని, ఇంధన ధరల తగ్గింపుపై చమురు మార్కెటింగ్ కంపెనీలతో ఎలాంటి చర్చలు లేవని చెప్పారు. ఈ మధ్య కాలంలో ఇంధన ధరలు తగ్గిన ఏకైక దేశం భారత్ అని ఆయన చెప్పారు.
దక్షిణాసియా దేశాల్లో పెట్రోల్, డిజిల్ ధరలు దాదాపుగా 40-80 శాతం పెరిగాయని, ఇతర పాశ్చాత్య దేశాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. కానీ భారత్‌లో మాత్రం ధరలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. నవంబర్ 2021, మే 2022లో రెండు సందర్భాల్లో సెంట్రల్ ఎక్సెజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించిందని కేంద్రమంత్రి గుర్తుచేశారు.