న్యాయాన్ని కాపాడవలసిన వారు.. అన్యాయానికి పాల్పడితే వ్యవస్థకు ఎంత ప్రమాదమో.. ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తే తెలుస్తోందని అనుకొంటున్నారు.. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఘోర ఘటనలో వ్యవస్థను నడిపించే వ్యక్తి దారి తప్పితే.. ఆ వ్యవస్థ ఎలా మారిందో క్రమ క్రమంగా వెలుగులోకి వస్తున్న విషయాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి.
అసలే పార్లమెంట్ ఎన్నికలకు సమయం సమీపిస్తుంది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం తెలంగాణ (Telangana)లో ప్రధాన చర్చాంశనీయంగా మారింది. ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకోవడం వల్ల దర్యాప్తులో వేగం పెరిగిన కొద్ది.. ఊహకు అందని సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.. ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన విషయం తెలిసిందే..
ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లో ఉన్న ఓ గెస్ట్ హౌజ్ వేదికగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అనేక అంశాలు చర్చకు వచ్చాయని తేలడంతో పోలీసులు ఆ గెస్ట్ హౌజ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు.. అయితే ఈ కేసులో కానిస్టేబుల్ నుంచి డీసీపీ స్థాయి వరకు ఈ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో బయటపడింది.
కాగా మరో సంచలన విషయం బయటపడింది. నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ ఫోన్ ట్యాపింగ్‌తో ఒక్కరూ కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 40 మంది మహిళలను లైంగికంగా వేధించారని విచారణలో బయటకు టాక్ వినిపిస్తోంది. కొందరి డేటా సేకరించి సదరు కానిస్టేబుళ్లు వ్యక్తిగత జీవితాలను కూడా టార్గెట్ చేశారని తెలుస్తోంది. నల్లగొండ-హైదరాబాద్ (Hyderabad) రోడ్డులో వార్ రూమ్‌లు ఏర్పాటు చేయడమే కాకుండా.. ఇందులో ఓ కానిస్టేబుల్ భారీ వసూళ్లకు పాల్పడ్డాడని సమాచారం.
మిల్లర్లు, స్మగ్లర్లు, పేకాట నిర్వాహకుల నుంచి స్థానిక రౌడీ షీటర్లతో చేతులు కలిపి ఓ పోలీస్ అధికారి సాయంతో ఈ తతంగం నడిపించినట్లు తెలుస్తోంది. అలాగే పలువురు నేతలకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం సైతం ఉన్నట్లు తెలుస్తోంది.