అడవిలో ఉన్నంత వరకే సింహం రారాజు.. ఒక్క సారి అడవి దాటి జనంలోకి ప్రవేశిస్తే.. దాని పని పట్టేదాక ఈ మనుషులు వదలరని తెలిసిందే.. అలాగే రాజకీయ నాయకులకు అధికారంలో ఉన్నంత వరకే విలువ.. ఒక్కసారి అధికారం.. పదవి పోయాయా.. ఎదురయ్యే పరిస్థితి ఊహించుకొని బ్రతకలేక నేతలు బోనులో ఉన్న పులిలా గింజుకోవడం కనిపిస్తోంది.. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఇలాగే ఉందంటున్నారు..
ఓటమి పలకరించగానే.. కేసులు బీఆర్ఎస్ (BRS) గడప తట్టాయి.. వరుసగా చేసిన పొరపాట్లు త్రాచుపాములా మెడకు చుట్టుకోవడం ప్రారంభించాయి.. ఇదే అవకాశంగా భావించిన ప్రతిపక్షాలు కారును కొలుకోకుండా పంక్చర్ చేసి స్క్రాప్ కు పంపించాలని వ్యూహాలు రచిస్తున్నట్లు చర్చలు మొదలైయ్యాయి.. ఇప్పటికే కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) తీవ్ర విమర్శలు చేస్తూ.. బీఆర్ఎస్ ను గుక్కతిప్పుకొనివ్వడం లేదంటున్నారు..
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు కొత్త ట్విస్ట్ లను ఇస్తూ.. ఇందులో ఉన్న పెద్దలను బయటకు లాగే వరకు ఆగదని అంటున్నారు.. ఇదే సమయంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ (Telangana) అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) ఈ కేసు విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని పేర్కొన్నారు.. నేడు మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఆఫీసు సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారానికి స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి.. కానీ, అలా కాకుండా ఇష్టమొచ్చినట్లు ట్యాపింగ్ చేశారనే అనుమానాలు లేవనెత్తారు.. బీఆర్ఎస్ ముఖ్య నేతల అనుమతి లేకుండానే ఇంత తతంగం జరిగిందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు..
మరోవైపు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత అరెస్ట్ అవడం.. తెలంగాణ సెంటిమెంట్‌కు సంబంధం లేదని తెలిపారు. ఈ స్కామ్‌లో కవిత (Kavitha) పాత్ర లేదని మీడియా ముందు బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోవడం కాదు.. దమ్ముంటే కేసీఆర్‌ను బహిరంగ చర్చకు రమ్మనండని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.