గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) వ్యవహారం రోజు రోజుకు ముదురుతుంది. ఇప్పటికే ఈ విషయంలో బీఆర్ఎస్ (BRS) పెద్దల హస్తం ఉన్నట్లు వార్తలు వస్తుండగా.. అధికారులు మాత్రం పక్కా ఆధారాలు సేకరించాకే సూత్రదారుల దగ్గరకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే కీలకమైన ఆధారాలను సేకరిస్తున్నారని సమాచారం..
కాగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధం ఉన్న పలువురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. అదేవిధంగా రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీకి మద్దతుగా వ్యాపారులు, ఇతర ప్రైవేట్ వ్యక్తుల నుంచి వసూలు చేసినట్లు రాధాకిషన్ రావు తెలుపడంతో.. ప్రత్యేక దృష్టి సారించిన హైదరాబాద్ (Hyderabad) పోలీసులు.. ఆ నగదు చివరకు ఎవరికీ చేరాయనే అంశంపై ‘ట్రావెల్ సీన్’ ను రికన్స్ట్రక్షన్ (Reconstruction of the travel scene) చేయనున్నారు.
ఈ ట్రావెల్ సీన్లో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరిని టార్గెట్ చేశారు. అతనిని ఏమని బెదిరించారు. ఎంత డిమాండ్ చేశారు. ఎంత ఇచ్చాడు. ఇచ్చిన డబ్బును ఏ వాహనం ద్వారా తరలించారు.. ఆ వాహనం నడిపిన డ్రైవర్ ఎవరు వంటి అంశాలపై ఫోకస్ చేశారు.. ఇక ఆ డబ్బు నేరుగా రాజకీయ పార్టీ నాయకులు, ప్రతినిధులకు ఇచ్చారా ?.. లేదా మధ్యలో ఎవరైనా ఉన్నారా అనే విషయాలను అధికారులు సేకరించనున్నారు.
అంతే కాకుండా ఆ డబ్బుతో ఎంత మంది గెలిచారు వంటి వివరాలను సైతం రాబట్టే పనిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ పాపంలో పాలు పంచుకొన్న అధికారుల వివరాలు.. వాటి వెనకాల ఉన్న రాజకీయ పెద్దల వివరాలను ఈసీ (EC)కి ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా ఇందులో భాగంగా అక్రమంగా వసూలు చేసిన డబ్బుతో గెలిచిన నాయకులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకొనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు (Radhakishen Rao) వాంగ్మూలం ముఖ్య నేతలతో పాటు కీలక శాఖలో ఉన్న అధికారులకు గోతులు తీస్తున్నట్లు తెలుస్తోంది.