తెలంగాణలో బీజేపీ (BJP) దూకుడు పెంచింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న నేతలు.. బీఆర్ఎస్ పాలనపై ఘాటు విమర్శలు చేస్తూ.. ప్రచారం నిర్వహిస్తున్న విషయం గమనించే ఉంటారు. కాగా ఎన్నికల ప్రచారంలో కవిత (Kavitha) లిక్కర్ స్కామ్ విషయాన్ని ప్రస్తావించని బీజేపీ నేతలు.. ప్రభుత్వం పై విమర్శలతో సరిపెట్టుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. బీఆర్ఎస్ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజేంద్రనగర్ లో పర్యటించిన పీయూష్ గోయల్ (Piyush Goyal).. ఉప్పర్ పల్లి లో ఉన్న ఓ హోటల్ లో పారిశ్రామిక వేతలతో సమావేశం అయ్యారు. భారత దేశ వ్యాప్తంగా బీజేపీ పార్టీ చేసిన అభివృద్ధిని వివరించిన మంత్రి.. బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు..కేసీఆర్ (KCR) విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డాడని విమర్శలు గుప్పించిన పీయుష్ గోయల్.. దొరల కుటుంబ పాలనకు సమయం ముగిసిందని ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.
కాళేశ్వరాన్ని కమిషన్ల ATMలా మార్చారని పీయూష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.. తెలంగాణలో బీజేపీ యేతర ప్రభుత్వం ఉన్న మోడీ రాష్ట్ర అభివృద్ధికి సహకరించారని వెల్లడించారు. మోడీ హయాంలో విదేశీ మారకం విలువ రికార్డ్ స్థాయిలో పెరిగిందని పీయూష్ గోయల్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు..
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రైలు ప్రమాదాలు తగ్గడంతో పాటు.. ప్రయాణ సమయం కూడా తగ్గిందని పీయూష్ గోయల్ తెలిపారు. ఫామ్ హౌస్ లో ఉండి పాలన చేస్తున్న కేసీఆర్ ను ఆ ఫామ్ హౌస్ కే పరిమితం చేయాలని తెలంగాణ ప్రజలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కోరారు..