విమానం కుప్పకూలి(Plane Crash) ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన బ్రెజిల్(Brazil)లో చోటుచేసుకుంది. అక్కడి ఆగ్నేయ మినాస్ గెరైస్(Southeast Minas Gerais) రాష్ట్రంలో ఆదివారం ఉదయం 10:30గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
సింగిల్-ఇంజిన్ గల ఈ విమానం గాల్లో ఉండగానే ముక్కలై మైనింగ్ పట్టణంలోని ఇటావాలో ఉదయం 10:30 గంటలకు కుప్పకూలినట్లు అగ్నిమాపక సిబ్బంది అక్కడి వార్తా సంస్థకి తెలిపారు. పొరుగున ఉన్న సావోపాలో రాష్ట్రంలోని క్యాంపినాస్ నగరం నుంచి బయల్దేరిన కాసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే విమానంలో ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురి మృతదేహాలను వారు బయటికి తీశారు. విమానం ఓ కొండపై పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రెజిల్‌లో చిన్న విమానాలు కూలిన ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల కిందటే సావోపాలోని అటవీ ప్రాంతంలో ఓ చిన్న విమానం కూలిపోయి ఇద్దరు మృతిచెందారు. గతేడాది డిసెంబరులో బ్రెజిల్‌లోని ఇల్హబెలా ద్వీపానికి వెళుతున్న హెలికాప్టర్ కూలడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో విమానం బ్రెజిల్‌లోని ఉత్తర అమెజాన్ రాష్ట్రంలో గతేడాది సెప్టెంబరులో ఒక విమానం కూలిపోలింది. ఈ ఘటనలో 14 మంది మృతిచెందారు.