లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణ (Telangana) లో బీజేపీ (BJP) దూకుడు పెంచింది. క్షేత్రస్థాయిలో.. మోడీ సర్కార్ పథకాలు, తీసుకొచ్చిన సంస్కరణలను ప్రచారం చేస్తోంది. ఇక విజయమే టార్గెట్ గా చేపట్టిన విజయ సంకల్ప యాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ (Adilabad)లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఇక తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ (Modi), ఇది ఎన్నికల సభ కాదని, అభివృద్ధి ఉత్సవమని పేర్కొన్నారు. 15 రోజుల్లో 5 ఎయిమ్స్ సంస్థలను ప్రారంభించామని, సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ వర్సిటీని స్థాపించామని పేర్కొన్నారు. రాంజీ గోండ్ పేరుతో హైదరాబాద్ (Hyderabad)లో ఆదివాసీ మ్యూజియం ప్రారంభించామని తెలిపారు. తెలంగాణ రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
అంతేకాకుండా దేశంలో 7 మెగా టెక్స్టైల్స్ పార్కులు త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అందులో ఒకటి తెలంగాణలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మోడీ గ్యారంటీ అంటే, అది కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ అని స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS)పై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగుబాటు విషయంలో బీఆర్ఎస్తో కాంగ్రెస్ (Congress) కుమ్మక్కవుతుందని ఆరోపించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి.. గతంలో మీరు తిన్నారు, ఇప్పుడు మేం తింటాం అన్నట్లుందని విమర్శించారు. బీఆర్ఎస్ పోయి, కాంగ్రెస్ వచ్చినా పాలనలో మార్పు లేదని మోడీ పేర్కొన్నారు. నా కోసం దాచుకోవాలనే ఆరాటం లేని ఒంటరిని అని తెలిపిన ప్రధాని.. 140 కోట్ల ప్రజలే నా కుటుంబం. ప్రజల కలల సాకారం కోసం ప్రతిక్షణం పని చేస్తానని తెలిపారు.. తెలంగాణలో రామమందిర ద్వారాలు తయారవడం ఈ రాష్ట్ర ప్రజల అదృష్టమని తెలిపిన మోడీ.. రాముడి ఆశీర్వాదం తెలంగాణ ప్రజలపై ఎప్పుడూ ఉంటుందన్నారు.
బీజేపీ వికసిత్ భారత్ కోసం కృషి చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ 400 సీట్లలో గెలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదని కిషన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ స్థానంలోనూ బీజేపీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు.