ఈ తొమ్మిదిన్నరేండ్లలో దేశంలో ప్రధాని మోడీ (PM Modi) ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్నారని బీజేపీ (BJP) తెలంగాణ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రధాని మోడీ పాలన అందిస్తున్నారని వెల్లడించారు.
ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా సేవాపక్సం కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో అమీర్ పేట్‌లోని ఎంసీహెచ్ గురుగోవింద్ స్టేడియంలో రక్త దాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. ప్రధాని మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు బీజేపీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.
దేశ వ్యాప్తంగా అక్టోబర్ 2న నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అక్టోబర్ 1న అన్ని ప్రాంతాల్లో కార్యాచరణ రెడీ చేస్తామన్నారు. ఆరోజే ప్రధాని మోడీ హైదరాబాద్ కు వస్తారని అన్నారు. ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
అనంతరం పాలమూరు బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారన్నారు. అక్టోబర్ 3న నిజామాబాద్ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారని వివరించారు. ప్రధాని మోడీ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. ఉచిత వ్యాక్సిన్ అందించడం, ఆర్టికల్ 370 రద్దు చేయడం, నూతన విద్యా విధానం, జీఎస్టీ, ఉచిత బియ్యం పంపిణీ, ఉగ్రవాద నిర్మూళనకు కృషి చేశారన్నారు.