‘రామ్ లల్లా’(Ram Lalla)తో భారత్ గుర్తింపు నేడు తిరిగి వచ్చిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ (RSS Chief) మోహన్ భగవత్ (Mohan Bhagwat) అన్నారు. దేశంలో రామ రాజ్యం వస్తుందనే భావనలో ప్రజలంతా ఉన్నారని చెప్పారు. ఐదు వందల ఏండ్ల తర్వాత రాముడు తిరిగి వచ్చాడని తెలిపారు. ఈ స్వర్ణ దినాన్ని మనం ఈ రోజు చూస్తున్నామన్నారు. రామ మందిరం కోసం ఎందరో చేసిన త్యాగాలను ధన్యవాదాలు తెలిపారు.
అయోధ్యలో ‘రామ్ లల్లా’ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అనంతరం నిర్వహించిన సభలో మోహన్ భగవత్ మాట్లాడుతూ…. వేడుకకు సంబంధించిన అన్ని ఆచారాలను పాటించినందుకు ప్రధాని నరేంద్ర మోడీని ఆయన అభినందించారు. ప్రధాని మోడీ ఒక తపస్వి అని కొనియాడారు. రాముని బాటలోనే మోడీ నడిచారని అన్నారు. ఇది నవ భారతానికి ప్రారంభమన్నారు.
శ్రీ రాముడి సంకల్పం మనందరికీ ఆదర్శమన్నారు. రాముడు దేశాన్ని ఏకం చేస్తాడన్నారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో కొత్త ఉత్సాహం నెలకొందన్నారు. ఈ రోజు రావడానికి కారణమైన ఎంతో మంది త్యాగాలను మనం మరిచిపోలేమన్నారు. వారందిరికీ సెల్యూట్ చేస్తున్నామని వెల్లడించారు. ఇక నుంచి చిన్న చిన్న వివాదాలపై ఘర్షణలు పడటం ఆపివేయాలని కోరారు. మన మంతా కలిసి రామరాజ్యాన్ని తీసుకు రావాలని సూచించారు.
సత్య, కరుణ, సుచిత, తపస్ ఈ నాలుగు సూత్రాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. వాటిని ఈ యుగంలో అమలు చేయాలన్నారు. రాముడు ప్రతి చోటా ఉంటాడని సత్యం చెబుతుందన్నారు. కరుణ అంటే దయ అని, మనమంతా మానవాళికి సేవ చేస్తూ దయగా ఉండాలని కోరారు. పౌరులు క్రమశిక్షణ, సంయమనం పాటించాలన్నారు. సమాజ శుద్ధికి తపస్సు అవసరం. ప్రధాని మోడీ తన వంతు తపస్సు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చిందన్నారు.