తమిళనాడు తిరుచిరపల్లి ( Tiruchirappalli)లో అభివృద్ధి చేసిన ఎయిర్ పోర్టు టెర్మినల్ ( Airport Terminal Building)ను ప్రధాని మోడీ (PM Modi) మంగళవారం ప్రారంభించారు. రాష్ట్రంలో చెన్నై తర్వాత రెండవ అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం తిరుచ్చి ఎయిర్ పోర్టు కావడం విశేషం.
ఈ విమానాశ్రయంలో అధ్యాత్మికత ఉట్టిపడుతోంది. ప్రయాణికులకు ఆలయ గోపురం ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఈ టర్మినల్ భవనాన్ని నిర్మించారు. ఇందులో మొత్తం 60 చెక్ ఇన్ కౌంటర్లు ఉన్నాయి. 5 లగేజీ చెకింగ్ కౌంటర్లు, 60 ఇమిగ్రేషన్ కౌంటర్లు, 44 డిపార్చర్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.
ఈ టెర్మినల్లో తాము చాలా పెయింటింగ్ వర్క్స్, మురల్స్ (కుడ్య చిత్రాలు) వేయించినట్టు టెర్మినల్ ఆర్ట్ వర్క్ క్రియేటివ్ డైరెక్టర్ రాజా విఘ్నేశ్ తెలిపారు. మొత్తం 100 మంది కళాకారులు ఈ పెయింటింగ్స్ వేశారన్నారు. తిరుచిరాపల్లికి చెందిన సాంస్కృతిక చైతన్యం నుంచి ప్రేరణ పొంది ఈ నూతన భవనాన్ని డిజైన్ చేసినట్టు అధికారులు వెల్లడించారు.
ఈ నూతన టెర్మినల్ రాష్ట్రంలో ఆర్థిక వృద్ధిని పెంచుతుందని అధికారులు చెబుతున్నారు. మెరుగైన కనెక్టివిటీతో విమాన ప్రయాణాన్ని మెరుగు పరచడంలో దోహదపడుతుందని చెబుతున్నారు. రూ. 1100 కోట్లు ఖర్చు చేసి ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. ఈ టెర్మినల్ ద్వారా ఏటా 44 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని పీఎంవో కార్యాలయం తెలిపింది.