చైనా(China)తో సంబంధాలపై ప్రధాని మోడీ(PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌కే కాదు.. ప్రపంచానికీ చైనాతో సంబంధాలు ముఖ్యమేనని అభిప్రాయపడ్డారు. అమెరికాకు చెందిన ప్రముఖ మేగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్‌లో ఏర్పడిన క్వాడ్ కూటమి.. ఏ ఒక్క దేశానికీ వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. తమకు వ్యతిరేకంగా ఈ కూటమి ఏర్పడిందంటూ గతంలో చైనా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మోడీ క్లారిటీ ఇచ్చారు.
ద్వైపాక్షిక చర్చల్లో భారత్-చైనా(Bharath-China) సరిహద్దు పరిస్థితిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరముందన్నారు. రెండు దేశాల మధ్య స్థిరమైన, శాంతియుత బంధం ఉందని మోడీ చెప్పుకొచ్చారు. సానుకూల చర్చల ద్వారా శాంతిని పునరుద్ధరిస్తామని మోడీ వ్యాఖ్యానించారు. భారత్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని తెలిపారు. భారత్ ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోందని, దౌత్యపరంగా, శాస్త్రీయంగా, సైనికపరంగా ఎదుగుతున్న తీరు, భారత్‌ను ఓ వర్ధమాన సూపర్ పవర్‌గా నిలబెడుతోందని వివరించారు.
సరిహద్దుల్లో దీర్ఘకాలంగా నెలకొన్న పరిస్థితి వేగంగా పరిష్కారం కావాలన్నారు. అదే జరిగితే తమ ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోతుందని వెల్లడించారు. రామమందిరం గురించి తెలుపుతూ రాముడు అయోధ్యకు తిరిగి రావడం దేశ ఐక్యతకు సంబంధించినదని, ఇది ఒక చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. తటి ఆదరణ ఉన్న ప్రభుత్వమైనా రెండో విడత పదవీకాలం ముగిసేలోపు మద్దతు కోల్పోతుందని ప్రపంచవ్యాప్తంగా గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతోందన్నారు. కానీ భారత్ మాత్రం ఇందుకు మినహాయింపు ఉందన్నారు.
తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీకి అనూహ్యంగా మద్దతు పెరిగిందని మోడీ చెప్పుకొచ్చారు. పాక్ ప్రధానిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్‌కు అభినందనలు తెలిపినట్లు ప్రధాని మోడీ ఇంటర్వ్యూలో గుర్తుచేశారు. తాము శాంతి, భద్రత, ప్రజల శ్రేయస్సును కోరుకుంటున్నామని తెలిపారు. ఇక ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్షపై స్పందించడానికి మోడీ నిరాకరించారు. పొరుగు దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని మోడీ స్పష్టం చేశారు.