Telugu News » Atal Sethu : దేశంలో అతి పొడవైన వంతెన ‘అటల్ సేతు’ను ప్రారంభించిన ప్రధాని ..!

Atal Sethu : దేశంలో అతి పొడవైన వంతెన ‘అటల్ సేతు’ను ప్రారంభించిన ప్రధాని ..!

ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL)అని కూడా అంటారు. ఆర్థిక రాజధాని ముంబైకి మణిహారంగా ఈ వంతెన నిలుస్తోంది.

by Ramu
pm modi today inaugurated atal bihari vajpayee sewari nhava sheva atal setu bridge in maharashtra

– దేశంలోనే అతి పొడవైన ‘అటల్ సేతు’ ప్రారంభం
– మొత్తం 21.8 కిలో మీటర్ల వంతెన నిర్మాణం
– అరేబియా సముద్రంలోనే 16 కిలో మీటర్లు
– ఈఫిల్ టవర్​ కన్నా 17 రెట్ల ఇనుము వాడకం
– ఇది అభివృద్ధి చెందిన భారత్ ​కు ప్రతీక
– వికసిత భారత్ సంకల్పంతో ముందుకెళ్తున్నామన్న ప్రధాని మోడీ

దేశంలోనే అతి పొడవైన వంతెన ‘అటల్ సేతు’ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది అభివృద్ధి చెందిన భారత్​ కు ప్రతీక అని అన్నారు. అభివృద్ధి చెందిన భారత్​ ఎలా ఉండబోతుంది అనేదానికి ఇదొక చిన్న ఉదాహరణ​ మాత్రమే అని చెప్పారు. అందరికీ సౌకర్యాలు, శ్రేయస్సు, వేగం, పురోగతి ఉంటుందని తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్ లో దూరాలు తగ్గుతాయి.. దేశంలోని ప్రతి మూలకు రవాణా సౌకర్యం ఉంటుందని చెప్పారు.

pm modi today inaugurated atal bihari vajpayee sewari nhava sheva atal setu bridge in maharashtra

బతకడానికైనా, బతుకుదెరువు కోసం అయినా, ప్రతీదీ అంతరాయం లేకుండా సాగిపోతుందని అన్నారు. ఇదే అటల్ సేతు సందేశమని చెప్పారు మోడీ. ఈ వంతెనను ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని కూడా అంటారు. ఆర్థిక రాజధాని ముంబైకి మణిహారంగా ఈ వంతెన నిలుస్తోంది. దక్షిణ ముంబై-నవీ ముంబైలను కలుపుతుంది. సాధారణంగా దక్షిణ ముంబై నుంచి నేవీ ముంబైకి రెండు గంటల ప్రయాణ సమయం పడుతుంది.

ఈ వంతెన అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం 15 నిమిషాలకు తగ్గింది. మొత్తం 21.8 కిలో మీటర్లు ఇది ఉంటుంది. ఈ వంతెనను మొత్తం రూ.17,840 కోట్లతో నిర్మించారు. 2016 డిసెంబర్‌ లో శంకుస్థాపన చేశారు. ఏడేండ్లలో పూర్తి చేశారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్‌ గఢ్‌ జిల్లాలోని నహవా శేవాను కలుపుతూ నిర్మించారు. ఈ వంతెనపై రోజు 70 వేలకు పైగా వాహనాలు ప్రయాణించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

దీని పొడవు 21.8 కిలో మీటర్లు కాగా అందులో 16 కిలో మీటర్లకు పైగా అరేబియా సముద్రంపైనే ఉంటుంది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు రెండింటికీ కనెక్టివిటీని మెరుగుపరుస్తోంది. ముంబై నుండి పూణే, గోవా, దక్షిణ భారతదేశానికి ప్రయాణ సమయాన్ని తగ్గిస్తోంది. అదనంగా ఇది ముంబై పోర్ట్, జవహర్‌ లాల్ నెహ్రూ పోర్ట్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తోంది.

ఇక పారీస్‌ లోని ఈఫిల్​ టవర్ తో పోలిస్తే ఈ వంతెనకు 17 రెట్ల ఇనుమును వాడారు. స్టాట్యూ ఆఫ్​ లిబర్టీ విగ్రహానికి ఉపయోగించిన కాంక్రీట్ కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉపయోగించారు. ఈ వంతెనకు దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పేరును పెట్టారు. బందోబస్తు కోసం 400 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ వంతెన నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

శీతాకాలంలో ఇక్కడికి ఫ్లెమింగో పక్షులు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో వంతెనపై సౌండ్ బారియర్ ఏర్పాటు చేశారు. సముద్రపు జీవులకు హాని కలిగించని లైట్లను డిజైన్ చేసి ఉపయోగించారు. వాహనాలు ఆగిపోయినా, లేదా అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే ఆ సమాచారాన్ని సీసీటీవీ కెమెరాలు కంట్రోల్ రూమ్‌కి అందిస్తాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై చర్యలు చేపడతారు.

You may also like

Leave a Comment