నవంబర్ 15న ఆదివాసి పోరాట యోధుడు బిర్సా ముండా (Birsa Munda) జన్మదినాన్ని పురస్కరించుకుని దేశం మొత్తం ‘ట్రైబల్ ప్రైడ్ డే’ (Tribal Pride Day)గా జరుపుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరి హృదయాల్లో బిర్సా ముండా వున్నారని చెప్పారు. ఆయన జీవితం నుంచి నిజమైన ధైర్యాన్ని, ధృడమైన సంకల్పాన్ని మనమంతా నేర్చుకోవచ్చని వెల్లడించారు.
‘మన్ కీ బాత్’ 106వ ఎడిషన్‌లో ప్రధాని మోడీ మాట్లాడారు. దేశంలో పండుగ సీజన్ మొదలైందన్నారు. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా పౌరులంతా అక్కడి స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక వృత్తి కళాకారులకు చేయూతనిచ్చేందుకు గాను పండుగ సమయాల్లో కేవలం స్థానిక ఉత్పత్తులను మాత్రమే వాడాలని ప్రజలను ఆయన కోరారు.
అక్టోబర్ 31న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మేరా యువ భారత్ వేదికను ప్రారంభించనున్నట్టు తెలిపారు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేందుకు యువతకు ఇది అవకాశాలు కల్పిస్తుందన్నారు. మై భారత్ వెబ్‌సైట్ త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు. యువత www.mybharat.gov.inలో లాగిన్ అయి అక్కడ అందుబాటులో ఉన్న అవకాశాల కోసం నమోదు చేసుకోవాలని కోరారు.
అభివృద్ధి చెందిన భారత్ ను నిర్మించేందుకు, దేశంలోని యువ శక్తిని ఏకీకృతం చేసేందుకు ఇదో వినూత్నమైన ప్రయత్నమని వెల్లడించారు. ఇటీవల దేశంలో ఖాదీ వస్త్రాల విక్రయాలు గణనీయంగా పెరిగాయన్నారు. గాంధీ జయంతి సందర్బంగా రూ. 1.5 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయన్నారు. అమృత్ కలశ్ యాత్ర డిల్లీకి చేరుకుంటోందన్నారు. ఇందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టిని తీసుకు వస్తున్నామన్నారు.
ప్రతి గ్రామం నుంచి సేకరించిన ఆ మట్టితో దేశ రాజధాని ఢిల్లీలో అమృత్ వాటిక నిర్మిస్తామన్నారు. ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచి భారత కీర్తిని ప్రపంచం వ్యాప్తం చేసిన క్రీడాకారులను ఈ సందర్బంగా ప్రధాని మోడీ అభినందించారు. దీంతో పాటు పారా ఏషియన్ గేమ్స్ లో పతకాలు సాధించింన క్రీడాకారులను ఆయన ప్రశంసించారు.