విజయనగరం (Vizianagaram) జిల్లాలో ఘోర రైలు ప్రమాదం (Train Accident చోటు చేసుకుంది. కొత్తవలస మండలం కంటకా పల్లి వద్ద రెండు రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓవర్ హెడ్ కేబుల్ తెగిపోవడంతో విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలు కంటకాపల్లి వద్ద పట్టాలపై నిలిచి పోయింది.
అదే సమయంలో విశాఖ నుంచి పలాస వెళ్తున్న ఎక్స్ప్రెస్ వచ్చి ఆ రైలును ఢీ కొట్టింది. దీంతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
విశాఖ నుంచి రాయగఢ్ వెళ్తున్న రైలుకు ప్రమాదం జరిగినట్టు తనకు ప్రాథమిక సమాచారం అందినట్టు సీఎంఓ కార్యాలయ అధికారులు తెలిపారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అదికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఘటనా స్థలానికి వీలైనన్ని అంబులెన్సులను పంపించాలని సూచించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు అన్నీ సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు తనకు ఘటన గురించి సమాచారం అందించాలన్నారు.