PM :ప్రధాని మోడీ (Modi) తన స్వాత్రంత్య్ర దినోత్సవ సందర్భంగా చేసిన ప్రసంగంలో నైపుణ్యం గల విశ్వకర్మలకు రుణాలిచ్చి వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు పీఎం విశ్వకర్మ పథకం కింద ఈ వృత్తిలో ఉన్నవారికి లక్ష రూపాయల రుణం ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం తెలిపారు. 5 శాతం వడ్డీతో వారికి ఈ రుణంలభిస్తుందన్నారు. సాంప్రదాయ నైపుణ్యం గల విశ్వకర్మలను ప్రోత్సహించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని ఆయన చెప్పారు. సెప్టెంబరు 17 న విశ్వకర్మ జయంతి రోజున విశ్వకర్మ యోజనకు శ్రీకారం చుడుతామని ప్రధాని పేర్కొన్న విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. ఈ పథకం కింద చర్మకారులు, నాయీ బ్రాహ్మణులు, ఇతర చేతి వృత్తులవారికి రూ. 1300 కోట్ల నుంచి రూ. 1500 కోట్ల వరకు కేటాయిస్తామని మోడీ పేర్కొన్నారన్నారు.
అలాగే కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అశ్వినీ వైష్ణవ్ వివరిస్తూ పీఎం ఈ-బస్సు సర్వీసు ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించిందని చెప్పారు. ఈ ప్రతిపాదన కింద దేశ వ్యాప్తంగా కొత్తగా 10 వేల బస్సులను ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ని విస్తరించే ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించిందన్నారు.
రూ. 32, 500 కోట్లు వ్యయం కాగల కొత్త రైల్వే ప్రాజెక్టులను కేబినెట్ ఆమోదించిందన్నారు. ఈ ప్రతిపాదన కింద తెలంగాణ, యూపీ, బీహార్, గుజరాత్, ఒడిశా , బెంగాల్ తదితర రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన వివరించారు. ఇక ఈ-బస్ సర్వీసుకు రూ. 5,7613 కోట్లను కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించిందని మరో మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.