సనత్ నగర్ ( Sanath Nagar) ఈఎస్ఐ (ESI) లో ఓ పేషెంట్ సోదరిపై సిబ్బంది అత్యాచారం చేసిన కేసులో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారం అనంతరం నిందితుడు పరారీలో ఉండగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజుల పాటు గాలించి చివరికి నిందితున్ని అరెస్టు చేశారు. నిందితున్ని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా కోర్టు రిమాండ్ విధించింది.
అసలు ఏం జరిగిందంటే….. కర్ణాటకకు చెందిన బాధిత యువతి(19) సోదరుడు ఇటీవల గాయపడ్డాడు. అతన్ని ఫిజియో థెరపి నిమిత్తం సనత్ నగర్ లోని ఈఎస్ఐకి తీసుకు వచ్చారు. వైద్య చికిత్స అనంతరం కర్ణాటకకు వెళ్లి పోయారు. మళ్లీ ఇటీవల సోదరుని కాలు నొప్పిగా అనిపించడంతో అతనితో పాటు ఆమె కూడా ఈఎస్ఐకి వచ్చింది.
వైద్య చికిత్స నిమిత్తం ఆమె సోదరుడు ఇన్ పేషెంట్ గా అడ్మిట్ అయ్యాడు. ఈ క్రమంలో తన సోదరునికి భోజనం తీసుకు వచ్చేందుకు మూడు రోజుల క్రితం ఆమె ఆస్పత్రిలోని ఆరవ అంతస్తులోకి వెళ్లింది. అక్కడ పార్శిల్ తీసుకుని వస్తుండగా క్యాంటీన్ లో పని చేసే షాబాద్ ఆమెను అడ్డుకున్నాడు. అక్కడి నుంచి లిఫ్టులో రెండో అంతస్తుకు తీసుకు వెళ్లాడు.
అక్కడ బాధితురాలిపై షాబాద్ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం జరిగిన విషయాన్ని యువతి ఆస్పత్రి సిబ్బందికి తెలిపింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు షాబాద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.