కాంగ్రెస్ (Congress) పార్టీని వీడిన మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దియోర (Milind Deora)పై శివసేన (ఉద్దవ్ ఠాక్రే) వర్గం ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ప్రస్తుతం రాజకీయాలన్నీ అధికారం చుట్టే తిరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం రాజకీయాల్లో సిద్దాంతాలు, విలువలు, విశ్వాసం అనేవి లేనే లేవని మండిపడ్డారు.
మిళింద్ దియోర తండ్రి మురళి దియోర చాలా గొప్ప నాయకుడని కొనియాడారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ కు మురళి దియోర సేవలు అందించారని గుర్తు చేశారు. పార్టీ కోసం ఏం చేయాలనే విషయం మురళి దియోరకు తెలుసన్నారు. మిళింద్ దియోర తనకు తెలుసన్నారు. ఆయనకు పార్టీతో మంచి సంబంధం ఉందన్నారు.
కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. మహారాష్ట్ర సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మిళింద్ దియోర కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఆయన శివసేన (ఏక్ నాథ్ షిండే) వర్గంలో చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే స్పందించారు. మిలింద్ దియోరకు తమ పార్టీ స్వాగతం పలుకుతోందని చెప్పారు.
మిలింద్ దియోర రాజీనామా గురించి తనకు తెలిసిందని పేర్కొన్నారు. మిలింద్ ఒక వేళ తమ పార్టీలో చేరతానంటే తాము స్వాగతం పలుకుతామని వెల్లడించారు. అంతకు ముందు మిలింద్ దియోర తన రాజీనామా గురించి ట్విట్టర్ లో వివరించారు. కాంగ్రెస్తో తన బంధం ముగిసిపోయిందని పేర్కొన్నారు.