బీఆర్ఎస్(BRS) హయాంలో అమలు చేసిన ‘ధరణి’(Dharani) అనే దయ్యాన్ని సరిదిద్దుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. పార్లమెంట్ ఎన్నికలో భాగంగా ఖమ్మం(Khammam) లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి పర్యటనలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఆర్ గార్డెన్స్(SR Gardens)లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్(KCR) అహంకారానికి సమాధానం గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఏర్పడ్డాక జిల్లాకు ముగ్గురు మంత్రులను అధిష్ఠానం ఇచ్చిందని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామని తెలిపారు.
అధికారం, డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తవగానే అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. తమది వ్యాపారస్తులు, ఉద్యోగులను ఇబ్బంది పెట్టే పార్టీ కాదని స్పష్టం చేశారు. జిల్లాలో నెలకొన్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.
పార్టీలకు అతీతంగా అందరినీ సమన్వయం చేసుకుంటామన్నారు. ప్రజా ద్రోహులను శంకర్ గిరి మాన్యాలకు పంపిస్తామని హెచ్చరించారు. ప్రజలు ఆలోచన చేయాలని, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సూచించారు. ప్రజాపాలనలో అన్ని హామీలు తప్పక నెరవేరుతాయని పునరుద్ఘాటించారు.