పార్టీలు మారిన ప్రభుత్వాలు మారిన రాజకీయ విమర్శలు మాత్రం ఆగవని ప్రస్తుతం నేతలు నిరూపిస్తున్నారు.. కాగా నేడు భోగి వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర జరుగుతోన్నట్టు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ అంశంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఫైర్ అయ్యారు.
బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడిన మాటలు జ్యోతిషం చెప్పినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.. బీఆర్ఎస్ (BRS)కు ప్రభుత్వాన్ని కూలగొట్టే ధైర్యం లేదని మండిపడ్డ పొన్నం ప్రభాకర్.. కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేలని ముట్టుకునే ధైర్యం ఎవరూ చేయరన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ.. అవినీతి చేయందే బ్రతకలేమన్నట్టు వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ రెండు ఒక్కటే అని ఎన్నో సార్లు నిరూపించబడినట్టు పేర్కొన్నారు.
అయోధ్య రామాలయం ప్రారంభం ముహూర్తంపై జగద్గురువులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ముందుకు వెళ్ళడం అరిష్టం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఫల్యం చెందిన ఎంపీలలో బండిసంజయ్ నంబర్ వన్ అని విమర్శించారు.. కరీంనగర్ కి కేసీఆర్, వినోద్ కుమార్, బండి సంజయ్ ఎంపీగా ఏం అభివృద్ధి చేసారో, నేను ఎంపీగా ఏం చేసానో చర్చకి వస్తారా? అని సవాల్ విసిరారు.
కేటీఆర్ అధికారం కోల్పోయిన అసహనంతో ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారని, సీఎం పదవి కన్నా కేసీఆర్ పవర్ పుల్ అనే భ్రమలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టు ఆరోపణలు చేశారు. సీఎం పదవి ఎడమ కాలు చెప్పుతో సమానం అని తండ్రి అంటే కొడుకు సీఎం పదం కంటే కేసీఆర్ పదం పవర్ బ్యాంక్ అనడం ఆశ్చర్యంగా ఉందని పొన్నం విమర్శించారు. జీవితంలో ఎప్పుడూ కూడ బీజేపీ (BJP).. కాంగ్రెస్ కలిసి పని చేయవని స్పష్టం చేశారు.
మరోవైపు రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందన్నారు. ప్రజల అభిప్రాయాల మేరకు మరోసారి జిల్లాల, నియోజకవర్గాల మండలాల పునర్విభజనపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. దేశ సంపద కాంగ్రెస్ సృష్టిస్తే, సంస్థలు ఏర్పాటు చేస్తే బీజేపీ అమ్ముతోందని ఆరోపణలు చేశారు. త్వరలోనే ఆర్టీసి ప్రయాణీకుల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపిన పొన్నం ప్రభాకర్.. భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అన్యాయానికి గురైన వారు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకొంటామని వెల్లడించారు.