రాష్ట్రంలో కొలువుదిరిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు.. ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు అమలవుతుంది. తాజాగా రూ. 500కి గ్యాస్.. 200 యూనిట్లలోపు కరెంటు ఫ్రీ వంటి పథకాలు అమలవుతున్నాయి.. వీటితో కలిపి మొత్తం నాలుగు హామీలను ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హైదరాబాద్ (Hyderabad), అమీర్‌పేట్ (Ameerpet)లో ప్రభుత్వ ప్రతిష్టాత్మక గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీటర్ రీడింగ్ తీసి జీరో బిల్లులను మహిళలకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. తమది హామీలిచ్చి కాలయాపన చేసే ప్రభుత్వం కాదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
సుమారు వెయ్యి రూపాయల విలువజేసే కరెంట్‌ను ఒక్కో ఇంటికి ఉచితంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇలా క్రమక్రమంగా అభివృద్ధి చేస్తున్న కొత్త ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వండి కానీ.. అనవసరమైన విమర్శలు తగదని హితవు పలికారు. అదే విధంగా ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్లతో పాటు మిగతా వాగ్ధానాలు కూడా పూర్తి చేస్తామని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
మరోవైపు ఆరు గ్యారంటీల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం.. 200 యూనిట్లలోపు కరెంటు వాడే వినియోగదారులు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి నెల ప్రారంభం నుంచి అనగా శుక్రవారం నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. 200యూనిట్లకు పైన ఒక్క యూనిట్ అధికంగా కరెంట్ వాడినా పూర్తి బిల్లు కట్టాల్సిందే అని సూచించింది.