మహిళలకు బస్సులో ఉచిత రవాణా సౌకర్యంతో ఆటోడ్రైవర్లు ఆందోళన చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి(Minister) పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. ప్రజా భవన్(Praja Bhavan) లో మంగళవారం ప్రజావాణి కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటోడ్రైవర్లు ఇబ్బంది పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఆటో డ్రైవర్లు తమ సోదరులేనని వాఖ్యానించారు. వాళ్ళకు తప్పకుండా న్యాయం చేస్తామని, ఈ మేరకు విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పారు. అప్పటి వరకు ఆటో డ్రైవర్లు కొద్దిగా ఓపికగా ఉండాలని మంత్రి పొన్నం కోరారు.
ప్రజావాణి కార్యక్రమం చాలా బాగా జరుగుతోందని, ఇవాళ 5,126 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వీటిలో చాలా మంది సొంత ఇల్లు లేదని దరఖాస్తులు సమర్పించారని తెలిపారు. అదేవిధంగా నిరుద్యోగులు కూడా ఎక్కువ సంఖ్యలో ప్రజావాణికి వచ్చారని మంత్రి చెప్పారు. వారి సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని తెలిపారు.
కాగా, హైదరాబాద్‌లోని జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహిస్తున్న ప్రజావాణికి తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. తెల్లవారుజము నుంచే ప్రజాభవన్‌కు వస్తున్న ప్రజలు క్యూ కట్టి వినతిపత్రాలు సమర్పిస్తున్నారు.