రైతు రుణమాఫీ, పంటలకు రూ.500 బోనస్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కీలక ప్రకటన చేశారు. సిద్దిపేట జిల్లా(Siddipet District) హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లోని శుభం గార్డెన్(Shubham Gardens)లో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆగష్టు 15 లోపు రైతులకు రూ.లక్షల రుణమాఫీ, పంటలకు రూ.500 బోనస్ ప్రభుత్వం చేస్తుందని హామీ ఇచ్చారు. వచ్చే వానాకాలం పంటకు బోనస్ అందుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయని ప్రకటించారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్(Bandi Sanjay) నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశాడని ప్రశ్నించారు. కనీసం గ్రామాల్లో ఎప్పుడైనా కనిపించాడా? అంటూ ప్రజలను అడిగారు.
బండి సంజయ్ ఎంపీగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తేలేదంటూ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు చేసిందేమీలేదన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వాళ్ళ పార్టీ నేతలతో కూడా చేయి కలపరని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడమూ వృథా అని వ్యాఖ్యానించారు. విలువైన ఓటును కాంగ్రెస్ పార్టీకి వేయాలని ప్రజలకు సూచించారు.
తాను ఎంపీగా అయిదు సంవత్సరాలు ఏం చేశానో, బండి సంజయ్, వినోద్ కుమార్ ఎంపీలుగా ఏం చేశారో చర్చిద్దామని సవాల్ విసిరారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి ఎంపిక పార్టీ అధిష్టానం చూసుకుంటుందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కార్యకర్తలందరూ కష్టపడి పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 304 బూతులలో పార్టీ అభ్యర్థికి మెజారిటీ తీసుకురావాలని పిలుపునిచ్చారు.