మహనీయులు జ్యోతిరావుపూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని కవిత చేసిన ప్రతిపాదన వివాదానికి దారి తీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై (BRS MLC Kavitha) కాంగ్రెస్ మంత్రులు మాటల దాడులు కొనసాగిస్తున్నారు. తాజాగా, మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhaka) ఫైర్ అయ్యారు.
ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘కవిత నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. బీఆర్ఎస్ పార్టీ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చాక సామాజిక న్యాయం గురించి మాట్లాడాలి. ఫూలే విగ్రహం పేరుతో కవిత రాజకీయం చేస్తున్నారు. కవిత లిక్కర్ కేసులో బిజీ లేనట్టున్నారు. అందుకే కొత్త నినాదం ఎత్తుకున్నారు’’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు.
అదేవిధంగా కులగణన చేస్తామని మాట ఇచ్చామని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని మంత్రి తెలిపారు. కులగణన బలహీన వర్గాల కోసం తీసుకుంటున్న నిర్ణయం అని అభిప్రాయపడ్డారు. కులగణనకి సంబంధించి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. కులగణన శాస్త్రీయంగా జరుగుతుందని స్పష్టం చేశారు.
కాగా, ఎమ్మెల్సీ కవితపై మంగళవారం మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘పదేళ్లు మీ ప్రభుత్వంలో ఏం చేశారు’ అంటూ శ్రీధర్ బాబు ప్రశ్నలు సంధించారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌కు ఫూలే గుర్తుకు రాలేదా? అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.