– అవినీతి వైసీపీని తరిమేద్దాం
– ప్రజలకు పిలుపునిచ్చిన నేతలు
– జగన్ వల్ల జరిగిన నష్టంపై వివరణ
– అన్నింటా దోచేశారని విమర్శలు
– డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి
– ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని ప్రజలకు వినతి
దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ వాతావరణం కనబడుతోంది. ఏపీలో ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. ఇదిలా ఉండగా పల్నాడు జిల్లాలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రజాగళం సభ నిర్వహించింది. పదేళ్ల తర్వాత మరోసారి ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే సభపై కనిపించారు. ముందుగా గన్నవరం నుంచి ఆర్మీ హెలికాప్టర్ లో బొప్పూడి సభాస్థలికి ప్రధాని చేరుకొన్నారు. తర్వాత సభలో ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన మోడీ.. జూన్ 4న వచ్చే ఫలితాల్లో దేశంలో ఎన్డీఏకి 400 సీట్లు దాటతాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని అన్నారు.
“ఏపీ ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసింది. ఎన్డీఏ ఏపీ ఆత్మగౌరవాన్ని కాపాడింది. ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేశాం. పీవీ నరసింహారావుకు భారత రత్న ఇచ్చాం. ఏపీలో ప్రస్తుతమున్న వైసీపీ ప్రభుత్వాన్ని దించేయాలి. ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేపట్టింది. మంత్రులు అవినీతి మీదే ఫోకస్ పెట్టారు. ఐదేళ్లల్లో ఏపీ అభివృద్ధి కుంటుపడింది’’ అంటూ ఫైరయ్యారు. జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరు అనుకోవద్దన్నారు మోడీ. ఆ రెండూ పార్టీలూ ఒకటేనని, రెండు పార్టీల్లోని నాయకత్వాలు ఇద్దరూ ఒకే కుటుంబం నుంచి వచ్చాయని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ అభివృద్ధి జరగాలంటే లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లోని ఎన్డీఏ కూటమికే ఓటేయాలని కోరారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని.. ప్రజాస్వామ్యంలో వెలుగులు వెలిగించేలా సెల్ ఫోన్ లో లైట్లు వేయాలని కోరారు ప్రధాని. “చంద్రబాబు చేరికతో ఎన్డీఏ బలం మరింత బలపడింది. చంద్రబాబు, పవన్ ఏపీ కోసం కష్టపడుతున్నారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధిలో దూసుకుపోతుంది’’ అని మోడీ అన్నారు.
ఏపీలో గెలుపు ఎన్డీఏదే.. ఎవరికీ అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు. మోడీకి అండగా ఉంటామని చెప్పేందుకే మీరంతా తరలివచ్చారని తెలిపారు. ప్రజాగళం సభ.. రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా సభ అని పేర్కొన్నారు. ఐదేళ్లుగా విధ్వంస, అహంకార పాలన చూశామని వైసీపీపై విరుచుకుపడ్డారు. ప్రజల గుండెచప్పుడు బలంగా వినిపించేందుకే మూడు పార్టీలు కలిశాయని చంద్రబాబు తెలిపారు. మీరు ఇచ్చిన తీర్పే మీ జీవితాలను నిర్ణయిస్తుందని తెలిపిన బాబు.. మీ ఆశీర్వాదాలు కావాలని ప్రజలను కోరారు. మోడీ చేతుల మీదుగా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందన్నారు. కానీ, ఐదేళ్లలో ప్రజల జీవితాల్లో ఆనందమే లేదని విమర్శించారు. గంజాయి సరఫరా, వినియోగం పెరిగిందని విమర్శించారు. విధ్వంసమే జగన్ విధానంగా ఉందని విమర్శించారు. ఏపీ పోలీస్ శాఖను జేబు సంస్థగా మార్చుకున్నారని ఆరోపించారు. ఇద్దరు చెల్లెళ్లను కూడా జగన్ మోసం చేశారని ఆరోపణలు చేశారు. వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని.. జగన్ కు ఓటెయొద్దని చెల్లెళ్లే చెప్పారన్నారు. బ్యాడ్ గవర్నెన్స్ వల్ల ఏపీ నష్టపోయిందని, ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టేశారని ఆరోపించారు.
ఏపీకి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పారిపోతున్నాయన్నారు పవన్ కళ్యాణ్. అమరరాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇక్కణ్నుంచి వెళ్లిపోయాయని గుర్తు చేశారు. జగన్ ను రావణుడితో పోల్చిన పవన్.. రావణ సంహారం జరుగుతుందని పేర్కొన్నారు. త్వరలో రామరాజ్య స్థాపన జరుగుతుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కురుక్షేత్రంలో మోడీ శంఖం పూరిస్తారన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఒక సారా వ్యాపారని పవన్ విమర్శించారు. 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని.. 2024లో మరోసారి కనకదుర్గమ్మ సాక్షిగా పొత్తు పురుడు పోసుకుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా అంటుంటే.. జగన్ దాన్ని పక్కన పెట్టి అవినీతి చేస్తున్నారని దుయ్యబట్టారు. మద్యం, ఇసుకలో అక్రమాలు అని మండిపడ్డారు. ధర్మానిదే విజయం.. కూటమిదే గెలుపు అని పవన్ తెలిపారు.