అయోధ్య (Ayodhya)లో జనవరి 22న రామ్ లల్లా (Ram Lalla) విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ తో పాటు దేశ, విదేశాలకు చెందిన పలువురు ప్రముఖ నేతలు హాజరుకానున్నారు. సుమారు 8000 మంది వీఐపీ అతిథులు హాజరవుతారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చెబుతోంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సుమారు 10 వేలకు పైగా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో అయోధ్యలోని ప్రతి పాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. దీంతో పాటు డ్రోన్ల ద్వారా నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని పోలీసులు చెబుతున్నారు. మొత్తం ఏడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి అంచెలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు పోలీసులు భద్రతా అందించనున్నారు.
ఈ భద్రతా సిబ్బంది వద్ద స్పెషల్ ఆటోమేటిక్ ఆయుధాలు ఉంటాయి. అయోధ్యలో చిన్న ఈగ కూడా వీరిని దాటి రాలేదని అంటున్నారు. ఇక రెండవ అంచెలో ఎన్ఎస్జీ కమాండోలు భద్రత విషయాన్ని చూసుకోనున్నారు. ఇక మూడవ అంచెలో ఐపీఎస్ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. నాల్గవ అంచెలో సీఆర్ పీఎఫ్ పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక ఐదవ అంచెలో యూపీకి చెందిన యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ పోలీసులు ఉండనున్నారు. ఇక్కడ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే ఏటీఎస్ పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. ఆరవ అంచెలో ఐబీ పోలీసులు, ఏడవ అంచెలో యూపీ స్థానిక పోలీసులు భద్రతా ఏర్పాట్లను చూసుకోనున్నారు. ఇక డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో పాటు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకు వచ్చారు.
మొత్తం 6 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు, మూడు కంపెనీల పీఏసీ, 9 కంపెనీల ఎస్ఎస్ఎఫ్ భద్రత బలగాలను మోహరిస్తున్నారు. దీంతో పాటు ఏటీఎస్, ఎస్టీఎఫ్ లకు చెందిన ఒక యూనిట్ బలగాలు పగలు రాత్రి అయోధ్యలో కాపలా కాయనున్నాయి. అదనంగా 300 మంది పోలీసులు, 47 ఫైర్ సర్వీసులు, 40 రేడియో పోలీసు పర్సనల్, 37 మంది లోకల్ ఇంటెలిజెన్స్ పోలీసులు, 2 బాంబు డిటెక్షన్ స్క్వాడ్ లను వినియోగిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ముగ్గురు డీఐజీలు, 17 మంది ఎస్పీలు, 40 మంది ఏఎస్పీలు, 82 మంది డీఎస్పీలు, 90 మంది ఇన్స్పెక్టర్లతో పాటు 1000 మందికి పైగా కానిస్టేబుళ్లు, 4 కంపెనీ పీఏసీలు పీఎం సెక్యూరిటీ సర్కిల్లో మోహరించనున్నారు. యూపీ పోలీసులు నిఘా కోసం 10 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.