తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే పార్లమెంటు (Parliament) ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS)తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు బీఎస్పీ(BSP) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఓ లేఖను విడుదల చేశారు.
రాజ్యాంగానికి(Constitution), లౌకికత్వానికి (secularism) పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని, బహుజన సాధికారత, రక్షణ, భవిష్యత్తే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఈ చారిత్రాత్మక కూటమికి అనుమతించిన ఉక్కు మహిళ బెహన్‌జీ మాయావతి, మాజీ సీఎం కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
రాజకీయ పార్టీలు తమ సిద్దాంతాలు, బలాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకొని, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా, విజయం కోసం తమ వ్యూహాలను మార్చుకోవడం సర్వ సాధారణమని ప్రవీణ్ కుమార్ చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతి పక్షంలో ఉన్న పార్టీలు ఎక్కడో ఒక చోట పొత్తులతో ఎదిగినవేనని గర్తు చేశారు. దురదృష్టవశాత్తు కొందరికి ఇవి కనిపించడంలేదని చెప్పారు.
ఎప్పుడూ మాట్లాడనివారు కూడా బీఆర్ఎస్, బీఎస్పీ కూటమిని వ్యతిరేకించడం హాస్యాస్పదమని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ‘‘తనతో పాటు చాలా రోజులు ప్రయాణించిన తమ్ముళ్లు.. వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడారు. మీకందరికీ ఒక సలహా.. మీకు వ్యక్తిగతంగా లాభం జరుగుతుందనుకుంటే నన్ను వ్యక్తిగతంగా విమర్శించండి. అంతేగానీ తల్లి లాంటి బీఎస్పీ పార్టీని వ్యతిరేకించవద్దని కోరారు. బీఎస్పీ పార్టీ వెనక ఎంతో మంది మహనీయుల త్యాగం ఉందని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
మరోవైపు ఎన్నికల్లో పట్టుమని పది ఓట్లు రాని వాళ్లు, అంబేద్కర్, ఫూలే, కాన్షీరాంల ఫొటోలు పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్లే ధైర్యంలేని వాళ్లు, వాళ్ల కోసం పోరాటం చేయలేని పిరికిపందలకు తమ నిర్ణయాన్ని విమర్శించే అర్హత లేదని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తమ నిర్ణయం సరైనదో.. కాదో చరిత్రనే సమాధానం చెబుతుందని చెప్పారు.