President : ఢిల్లీ సర్వీసుల బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇది చట్టంగా మారింది. ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ.. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండ్మెంట్) యాక్ట్-2023 గా పేర్కొంది. ఈ నెల 3 న ఈ బిల్లును లోక్ సభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. రాజ్యసభలో ఈ బిల్లుకు అనుకూలంగా 131 మంది, ప్రతికూలంగా 102 మంది ఎంపీలు ఓటు చేశారు. ఢిల్లీ బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగులకు సంబంధించి కేంద్రానికే కంట్రోల్ ఉండేందుకు నిర్దేశించిన ఈ బిల్లును రాజ్యసభలో కొన్ని విపక్షాలు కూడా సమర్థించాయి.
కొద్దిపాటి వ్యతిరేకత ఎదురైనా ఎన్డీయే ప్రభుత్వం మొత్తానికి ఈ బిల్లును ఆమోదింపజేసుకోగలిగింది. ఇక డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, జనన మరణాల నమోదు సవరణ బిల్లు, జన విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లులకు కూడా రాష్ట్రపతి నుంచి ఆమోదం లభించింది. ఢిల్లీ సర్వీసుల బిల్లును ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejiriwal) మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వచ్చారు. రాజ్యసభలో ఇది వీగిపోయేలా చూసేందుకు విపక్షాల మద్దతును కూడగట్టారు. మొదట కాంగ్రెస్ కొంత విముఖత చూపినా చివరకు ఆయనకు మద్దతునివ్వడానికే నిర్ణయించుకుంది.
ఢిల్లీ ఐఏఎస్,ఇతర బ్యూరోక్రాట్ల బదిలీలు,నియామకాల విషయంలో తన ప్రభుత్వ ప్రమేయమేమీ ఉండదని, ఇది తన ప్రభుత్వ అధికారాలను హరించే విధంగా ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే ఢిల్లీకి సంబంధించినంతవరకు ఏ చట్టాన్నయినా ఆమోదించే అధికారం పార్లమెంటుకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని హోమ్ మంత్రి అమిత్ షా.. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రకటించారు.
ఇక ఈ చట్టం మేరకు జాతీయ రాజధాని సివిల్ సర్వీసు అథారిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. సంబంధిత కమిటీకి సీఎం చైర్మన్ గా, చీఫ్ సెక్రటరీ, హోమ్ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. వీరిలో సీఎం మినహా మిగిలిన ఇద్దరు కేంద్ర నియంత్రణలోనే ఉంటారు. మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకే ఉద్యోగుల బదిలీలు, నియామకాలు జరుగుతాయని, వీరి మధ్య ఏకాభిప్రాయం కుదరని పక్షంలో లెఫ్టినెంట్ గవర్నర్ దే తుది నిర్ణయమని ఈ ఆర్డినెన్స్ నిర్దేశించింది. ఇది చట్టమైంది కనుక ‘సుప్రీం’ అథారిటీ ఆయనే కానున్నారు.