జీవితంలోని సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మానసిక శక్తిని పెంపొందించుకోవాలని విద్యార్థు (Stundents)లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) సూచించారు. సానుకూల ఆలోచనలు, ఆనందాన్ని పెంపొందించే కార్యక్రమాల్లో పాల్గొవాలని విద్యార్థులకు ఆమె సూచనలు చేశారు. విద్యార్థులు సమగ్ర అభివృద్ధి, వారి జీవిత నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ… ఎంతో మంది విద్యార్థులను గొప్ప వారిగా తీర్చి దిద్దినందుకు హెచ్‌పీఎస్‌ను ఆమె అభినందించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు.
వందేండ్ల చరిత్ర గల ఈ స్కూల్‌లో విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో పాటు చాలా మంది గొప్పవాళ్లు ఈ పాఠశాలలో చదివారని గుర్తు చేశారు. హెచ్‌పీఎస్ విద్యార్థుల ప్రతిభతో భారతదేశ గౌరవం కూడా పెరుగుతూ వస్తోందని వెల్లడించారు. భావి భారత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులపై ఉందన్నారు.
పర్యావరణం, ప్రకృతి పైన విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇతరులకు సహాయపడే అలవాటును విద్యార్థులు అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, మంత్రి సీతక్కలు కూడా హాజరయ్యారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు వచ్చారు. నగరంలో ఐదు రోజాలు పాటు ఆమె పర్యటించనున్నారు.