ప్రధాని మోడీకి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ లేఖ రాశారు. హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని లేఖలో ప్రధానిని ఆమె కోరారు. గతంలో 2013లో కేదార్ నాథ్ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించినట్టుగానే హిమాచల్ ప్రదేశ్ వరదలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
హిమాచల్ ప్రదేశ్ కు ఆర్థిక సహాయాన్ని అందించాలన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు గాను రాష్ట్రానికి ప్రత్యేక సహాయాన్ని అందించాలని కోరారు. హిమాచల్ ప్రదేశ్ లోని మహిళలు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, యువత చాలా కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న వారని ఆమె లేఖలో పేర్కొన్నారు.
ఇటీవల తాను సిమ్లా, కులు, మనాలి, మండిలో విపత్తు బాధితులను కలిశానన్నారు. ప్రతిచోటా విధ్వంసం జరిగిందని, ఆ దృశ్యాలు తనకు చాలా బాధ కలిగించాయన్నారు. ఈ విపత్తులో ఇప్పటివరకు 428 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ఈ విపత్తు వల్ల చాలా మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విపత్తును 2013 కేదార్నాథ్ విషాదం లాగా జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు. బాధితులకు, రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించాలన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని సోదరులు, సోదరీమణులు ఉపశమనం కలిగించాలన్నారు. రాష్ట్రాన్ని సరిగ్గా పునర్నిర్మించాలని ప్రధానిని విజ్ఞప్తి చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.