సొంతిల్లు.. పేదల కల. దీన్ని తాము నెరవేర్చి తీరుతాం.. గత ప్రభుత్వం కట్టిన డబ్బా ఇళ్లకు ధీటుగా డబుల్ బెడ్రూం( Double Bedroom) ఇళ్లు కట్టిస్తామని 2014లో మేనిఫెస్టోలో ఈ పథకాన్ని పెట్టింది బీఆర్ఎస్ (BRS). అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రతిష్టాత్మకంగా కొన్నిచోట్ల పథకాన్ని ప్రారంభించింది. కానీ, ఖర్చు తడిసిమోపడు అవుతుండడంతో కొన్ని ఏరియాల్లో పిల్లర్లు, లేపి వదిలేసింది. కొన్ని చోట్ల ఇళ్లు పూర్తయినా లబ్ధిదారులకు ఇవ్వలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెతుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఇక, 2018లో సొంత జాగా ఉన్నవాళ్లకు 5 లక్షల సహాయం ఇస్తామని చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్. కానీ, ఈ స్కీమ్ లో ఇప్పటిదాకా కీలక అడుగు పడలేదు. ప్రజల్లో రోజురోజుకీ వ్యతిరేకత పెరుగుతుండడంతో తాజాగా గృహలక్ష్మి (Gruhalakshmi Scheme) అనే పథకాన్ని తెరపైకి తెచ్చింది. ఈ పథకం కింద 3 లక్షలు ఇస్తామని నియమ నిబంధనలను కూడా ఖరారు చేసింది. ఈనెల 10 లోపు.. పథకానికి సంబంధించిన పత్రాలను అర్హులు తీసుకుని రావాలని తెలిపింది. ఇందుకు మూడు రోజుల సమయమే ఇచ్చింది. ఈ పథకం నిబంధనల ప్రకారం కులం సర్టిఫికెట్ తప్పనిసరి అన్నారు. అదికూడా మహిళలకు అని చెప్పారు. ఇప్పుడు వారందరూ కొత్తగా కులం సర్టిఫికెట్ తీసుకోవాలి. మీ సేవాలో అప్లై చేస్తే వారం పడుతుంది. కానీ, ఇచ్చిన గడువు మాత్రం 3 రోజులే. ఇది కాకుండా ఇంటి పన్ను, కరెంట్ బిల్లులు జత పరచాలని నిబంధన పెట్టారు. ఇందులో గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ వాళ్ళు పన్ను కడితేనే బిల్లులు ఇస్తాం అని అనడంతో గత్యంతరం లేక అప్పు చేసైనా తెచ్చి కడుతున్నారు.
ఇల్లు వచ్చుడు ఏమోకాని వ్యవసాయం పెట్టుబడి సీజన్ కావడంతో.. అటు ఆ అప్పే కాకుండా, ఇటు ఇంటి పన్ను, కరెంట్ బిల్లులకు అదనపు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇది పేదలకు ఇళ్ళు ఇచ్చే పథకం కాస్త ప్రభుత్వానికి ఆదాయం సమాకుర్చుకునే పథకంలా మారిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఆన్ లైన్ కాకుండా ఆఫ్ లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ తీసుకుంటామని చెబుతున్నారు.. జిరాక్స్ లకు మరో అదనపు భారం. ఇలా ప్రజలపై భారం మోపడం తప్ప పేదలకు ఇళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదనేది విపక్షాల ఆరోపణ.
ఈ పథకం కోసం రేషన్ కార్డు తప్పనిసరి అన్నారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం ప్రభుత్వం బంద్ చేసి 7 సంవత్సరాలకు పై బడింది. రేషన్ కార్డులు లేని బాధితులు సుమరుగా లక్ష 40 వేల పైనే ఉన్నారని తెలుస్తోంది. వీళ్లందరికి ఈ పథకం వర్తించదు. ఇక మిగిలిన వారికి కుడా ఇంచుమించు ఇలాంటి కొరివిలే పెట్టి పథకాన్ని ఆదిలోనే అనుమానాలకు అవకాశం ఇచ్చారని అంటున్నారు విపక్ష నేతలు. ఎందుకంటే నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు మాత్రమే ఇస్తామని చెబుతోంది ప్రభుత్వం. కానీ, ప్రతి నియోజకవర్గంలో 12 వేల నుండి 15 వేల మధ్య ఇళ్ళు లేని వారు ఉన్నారు. మరో 20 వేల మంది పెంకుటిల్లు, శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో జీవనం సాగిస్తున్నారు. మొత్తంగా 30 వేల మంది గృహాల కోసం ఎదురుచూస్తుంటే 3 వేలే అని చెప్పి చేతులు దులుపుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు ప్రతిపక్ష నేతలు.
నిజంగా ప్రభుత్వానికి పేదలకు ఇళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే.. గ్రామ పంచాయతీల ద్వారా లేక మున్సిపాలిటీ అధికారుల ద్వారా 15 రోజుల గడువు ఇచ్చి సరైన పద్దతిలో నిజమైన పేదలకు ఇళ్లు ఇవ్వవచ్చు. కానీ, అలా చేయడం లేదు. 3 రోజుల్లో 6 సర్టిఫికెట్లు పెట్టి మరి అప్లై చేయమని చెప్పడంలోనే ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందని అంటున్నారు విపక్ష నేతలు.