అంతరిక్షంలోకి అణ్వాయుధాలను పంపేందుకు తాము పూర్తి వ్యతిరేకమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) స్పష్టం చేశారు. అంతరిక్ష ఆధారిత యాంటీ శాటిలైట్ ఆయుధాలను రష్యా అభివృద్ధి చేస్తోందంటూ అమెరికా (USA) చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత మాస్కోపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అంతరిక్షంలో ఉపగ్రహ విధ్వంసక ఆయుధాన్ని రష్యా అభివృద్ధి చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని ఇటీవల అమెరికా ప్రకటించింది. ఇది తీవ్ర ఆందోళనకర అంశమని పేర్కొంది. ఆ ఆయుధాన్ని రష్యా ఇంకా మోహరించలేదని, ప్రస్తుతానికైతే ఎలాంటి ముప్పులేదని తెలిపింది.
అమెరికా ఆరోపణలను రష్యా తోసిపుచ్చింది. ఉక్రెయిన్‌కు సాయంపై అమెరికా కాంగ్రెస్ మద్దతు పొందేందుకు బైడెన్ సర్కారు ఈ కొత్త ఎత్తు వేసినట్లు ఆరోపించింది. రక్షణశాఖ మంత్రి సెర్గీ పొయిగుతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతరిక్షంలోకి అణ్వాయుధాలను పంపడాన్ని రష్యా ఎప్పటికీ సమర్థించబోదన్నారు.
కొన్ని దేశాలు కావాలనే తమపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. అంతరిక్ష రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు తమతో కలిసి నడవాలని పాశ్చాత్యదేశాలను ఇప్పటికే పలుమార్లు ఆహ్వానించామని తెలిపారు. అయినా కొన్ని కారణాల వల్ల కొన్ని దేశాలు ముందుకు రాలేదంటూ పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి అన్నారు.