ఖమ్మం(Khammam) రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay) హాట్ కామెంట్స్ చేశారు. ఓడిపోయిన వ్యక్తికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది అని అన్నారు. తమది గెలిచినా ఖమ్మమే.. ఓడిపోయినా ఖమ్మమేనని స్పష్టం చేశారు. కానీ కొందరు అలా కాదని.. ఒకసారి ఖమ్మం వైపు చూసి, మరోసారి పాలేరు వైపు పోదామనే ఆలోచనలో ఉన్నారని.. కానీ, తమది అలాంటి ఆలోచన కాదన్నారు.
ఆదివారం ఖమ్మం నగరం నెహ్రూ నగర్ నందు ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని, మాట్లాడారు. తాను ఇక్కడి భూమి పుత్రుడిని, మరోసారి ఆశీర్వదించండి అని కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఒక్కసారి ఖమ్మంకు మంత్రి పదవి వచ్చినందుకే ఇంత అభివృద్ధి చేసుకున్నామని.. మళ్లీ గెలిపిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.
కొందరికి కడుపు నొప్పి వస్తే, అందరికీ కడుపు నొప్పి రావాలని భావిస్తున్నారని విమర్శించారు. అది వారి స్వార్ధ రాజకీయాల కోసం జిల్లాను బలి పెడదామనుకుంటే అందుకు ఖమ్మం జిల్లా ప్రజలు సిద్ధంగా లేరన్నారు. సమయానుకూలంగా అందరికి అవకాశాలు రావాలని అనుకోవాలని తెలిపారు. యువకులు రాజకీయాల్లోకి రావాలంటే తమకు అవకాశం ఇస్తేనే వస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ కూడా ఇంకొక తరాన్ని తయారు చేసుకోవాలన్నారు.
కొందరికి ఒక్కసారి అవకాశం ఇస్తే దానిని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శించారు. ఖమ్మం అభివృద్ధిలో ముందుందని దానిని వెనుకకు నెట్టాలని కొందరు కలలు కంటున్నారని పేర్కొన్నారు. రూమర్స్, గోబెల్ ప్రచారాల ద్వారా మనల్ని ఆగం చేయాలని చూస్తున్నారని వారి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని స్పష్టం చేశారు.